కవితకే వదిలేశారా? లిక్కర్ స్కాంపై మంత్రి కేటీఆర్ మౌనం
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఎవరూ మాట్లా
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఎవరూ మాట్లాడొద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చిందో ఏమో తెలియదుగానీ ఎవరూ నోరుమెదప లేదు. ఎమ్మెల్సీ కవితపై వచ్చిన లిక్కర్ స్కాం ఆరోపణలను ఖండించలేదు. ఎమ్మెల్సీకే కౌంటర్ ఇచ్చే బాధ్యతలను నాయకత్వం అప్పగించినట్లు సమాచారం. కేవలం న్యాయవాదులు, టీఆర్ఎస్వీ నేతలు మాత్రం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి కేటీఆర్ సైతం కవితపై వచ్చిన ఆరోపణలపై స్పందించనూ లేదు. ఖండించనూ లేదు.
మునుగోడు బై ఎన్నికలా? లేకుంటే కేసీఆర్ దూకుడు తగ్గించడానికా తెలియదు గానీ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాంలో భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీ వేదికగా ఆరోపణలు చేశారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు సైతం స్పందించారు. విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే గులాబీ పార్టీ నేతలు మాత్రం ఆరోపణలపై స్పందించ లేదు. కేవలం న్యాయవాదులు, టీఆర్ఎస్వీ నేతలు మాత్రమే స్పందించారు. బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మాత్రమే స్పందించారు. తనపై కావాలని బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలను ఆమె మాత్రమే ఖండించుకున్నారు. పార్టీ నాయకత్వం ఆమెకే వదిలిసినట్లు స్పష్టమవుతోంది. పార్టీ ఆదేశాలు ఇచ్చిందో ఏమోగానీ.. ఏ ఒక్క నేత స్పందించకపోవడం, ఆమెకు బాసటగా నిలువకపోవడం శోఛనీయం.
మేము స్పందించం...
లిక్కర్ స్కాంలో కవితకు భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ స్పందించలేదు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీని సైతం లిక్కర్ స్కాం గురించి అడిగితే ఆరోపణలు వచ్చిన వారే ఖండించారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే సైతం అదే విధంగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత నిఖార్సయిన ఉద్యమ కారిణి అని, కావాలనే ఆరోపణలు చేస్తూ బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని, వచ్చిన ఆరోపణలపై ధీటుగా స్పందించిందని బదులిచ్చారు. ఇంకా ఎవరు మాట్లాడే సాహసం చేయలేదు. అంటే పార్టీ అధిష్టానమే ఆదేశాలు ఇచ్చిందేమోనని ప్రజల్లో చర్చనీయాంశమైంది.
స్పందించని కేటీఆర్
నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. కేంద్రం అనుసరించే విధానాలను, కేంద్రమంత్రులు చేసే ఆరోపణలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతల అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తుంటారు. ప్రజలకు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. కానీ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను మాత్రం ఖండించలేదు. మునుగోడులో అమిషా చేసిన ఆరోపణలను సైతం ఆయన శైలీలో ఖండించారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను సైతం తిప్పికొట్టారు. కానీ కవితపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో చర్చనీయాంశమైనా.. ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. ఒక మంత్రిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలను ఖండించాల్సి ఉన్నప్పటికీ.. ఎందుకు ఖండించలేదని రాజకీయ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏమై ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ స్పందిస్తే విమర్శల పాలు అవుతామా? లేకుంటే కావాలని అంశాన్ని పెద్దదిగా చేసినట్లు అవుతుందని స్పందించలేదో తెలియదుగానీ... మౌనం మాత్రం పాటించారు.