బీజేపీకి టచ్‌లో TRS ఎమ్మెల్యేలు, మంత్రులు?

తెలంగాణ రాజకీయంలో వలస నేతలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. కడువా మార్చే నేతల కోసం ప్రత్యర్థి పార్టీలు గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నాయి.

Update: 2022-10-22 13:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో వలస నేతలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. కడువా మార్చే నేతల కోసం ప్రత్యర్థి పార్టీలు గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుండటం ఆసక్తిని రేపుతున్నది. ఈ దెబ్బతో బూరనర్సయ్య గౌడ్ పార్టీ మారాడనే కారణంతో బీజేపీకి చెందిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్‌లను హుటాహుటిన పార్టీలోకి చేర్చుకున్న కారు పార్టీ జోరు అంతలోనే నీరుగారిపోనుందా అనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రారంభించిన మైండ్ గేమ్‌కు ధీటుగా బదులు ఇచ్చేందుకు బీజేపీ సైతం సిద్ధం అవుతున్నదనే చర్చ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం బీజేపీని వీడిన వారంతా ఏమాత్రం ప్రభావం చూపని నాయకులని, కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని వారంతా త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు రివర్స్ ఎటాక్ ప్రారంభించింది బీజేపీ. అంతటితో ఆగని బీజేపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల జిల్లాల పేర్లను సైతం ప్రస్తావించడం టీఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోందని తెలుస్తున్నది.

బీజేపీకి టచ్‌లో TRS ఎమ్మెల్యేలు, మంత్రులు?

మునుగోడు ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలే తనకు ఫోన్ చేసి చెబుతున్నారని అన్నారు. ఇక రఘునందన్ రావు మాట్లాడుతూ కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పారు. వీరంతా అదును కోసం చూస్తున్నారని సమయం సందర్భం రాగానే బీజేపీ గూటికి చేరడం ఖాయం అని కామెంట్ చేశారు. బీజేపీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ఎలా ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమతో టచ్‌లోకి వచ్చారని చెప్పడంతో కారు పార్టీలో కలవరం మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, తాము పార్టీని వీడటం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం తమతో అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు రహస్యంగా అందుబాటులో ఉన్నారని చెప్పడం గులాబీ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోందట.

అదును చూసి దెబ్బ కొట్టే వ్యూహం?

కేసీఆర్ తమ పార్టీ విషయంలో మైండ్ గేమ్ ప్రారంభించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మునుగోడులో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్న సంగతి పసిగట్టిన కేసీఆర్.. నష్ట నివారణ కోసమే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారని కానీ కేసీఆర్ నియంతృత్వ పోకడలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అంసతృప్తితో రగిలిపోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్న మాట. కేసీఆర్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌ను అట్టర్ ప్లాప్ చేసేందుకు మునుగోడునే వేదికగా మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31న అమిత్ షా లేదా జేపీ నడ్డా మునుగోడుకు రాబోతున్నారు. ఆ రోజున టీఆర్ఎస్‌లో భారీ కుదుపు తప్పదనే మాట బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆరోజు కాకుంటే మునుగోడు ఫలితం తర్వాత అయినా టీఆర్ఎస్ నుండి ఏక్ నాథ్ షిండేలు బయటకు వస్తారని కమలనాథులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తక్షణ చర్యగా ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ తిరిగి టీఆర్ఎస్‌కే బెడిసి కొట్టేలా కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలతో గులాబీ పార్టీ ఆలోచనలో పటిందని, మన పక్కనే ఉంటూ మనకే దెబ్బతీయాలని చూస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జోరుగా జరుగుతోందట. అయితే పార్టీ మారే విషయంలో అనేక మంది పైకి ఒకలా చెబుతున్నా బూర నర్సయ్య విషయంలో జరిగినట్టు సీక్రెట్ ఆపరేషన్ జరిగితే పార్టీ పరిస్థితేంటి అనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోందట. మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష్‌లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నది.

Tags:    

Similar News