IT Raids:గులాబీలో ''రైడ్స్'' గుబులు.. ముగ్గురు మంత్రులకు బిగుస్తోన్న ఉచ్చు.. ఇక నెక్ట్స్ ఎవరు?

కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో రాష్ట్ర అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.

Update: 2022-11-22 11:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో రాష్ట్ర అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ముగ్గురు మంత్రుల చుట్టూ ఎంక్వయిరీ మొదలైంది. గత కొన్ని వారాలుగా ఐటీ, ఈడీ దాడులతో హైదరాబాద్ నగరం అట్టుడికిపోతున్నది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఆగస్టులో వెలుగులోకి వచ్చింది మొదలు తెలంగాణపై సోదాలు, తనిఖీల పరంపర కొనసాగుతూ ఉన్నది. గ్రానైట్ స్కామ్‌కు సంబంధించి ఈడీ బృందాలు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటితో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన కంపెనీలపై సోదాలు చేశాయి. చీకోటి ప్రవీణ్ కాసినో వ్యవహారంలో మంత్రి తలసాని సోదరులను, వ్యక్తిగత సహాయకుడిని పిలిచి విచారించాయి. తాజాగా మంత్ర మల్లారెడ్డితో పాటు ఆయన సోదరులు, కుమారులు, అల్లుడి నివాసాల్లో, విద్యా సంస్థల్లో, వాటి అకౌంట్లు నిర్వహించే బ్యాంకుల్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి.

గతంలో కాసినో వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఒకదాని తర్వాత ఒకటిగా ఐటీ, ఈడీ బృందాలు సోదాలు, విచారణ, నోటీసులు లాంటివి కొనసాగుతూ ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే టార్గెట్‌ అవుతుండడంతో వారిలో గుబులు మొదలైంది. ఏ రోజు ఏ దర్యాప్తు సంస్థ మీద పడుతుందోననే ఆందోళన వారిని వెంటాడుతున్నది. పార్టీలో ఏ ఇద్దరు, ముగ్గురు మీట్ అయినా వీటి మీదే చర్చ జరుగుతున్నది. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని అధికార పార్టీ నేతలు ముందుగానే పసిగట్టారు. దానికి మానసికంగా సిద్ధమవుతున్నట్లు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నా ఒకేసారి పదుల సంఖ్యలో సోదాలకు వస్తుండడంతో ఎక్కడ ఏది బైటపడుతుందోననే టెన్షన్ వారిని ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు.

ఒకవైపు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇండ్లు, విద్యా సంస్థల్లో సోదాలు జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసరంగా తెలంగాణ భవన్‌లో మీటింగ్ కావడం గమనార్హం. పార్టీ వ్యవహారాలపై సమావేశం జరిగిందని చెప్తున్నా తదుపరి ఏం చేయాలన్నదానిపైనే చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస గౌడ్ సైతం టీఆర్ఎస్ నేతలపై టార్గెటెడ్‌గానే ఈ దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరిస్తూనే ఇకపైన కూడా దాడులు కొనసాగుతాయని, ప్రజాక్షేత్ర, ద్వారా తిప్పికొడతామనే ప్రకటనలు ఇస్తున్నారు. పొద్దున్నే లేవగానే ఎవరి ఇంటిపై ఏ దాడులు జరుగుతాయో, ఏ వార్తలు వినాల్సి వస్తుందోననే ఆందోళన మొదలైంది. 

Read more:

1.రాజీనామా చేయాలంటూ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఫోన్ కాల్... ఆడియో వైరల్

Tags:    

Similar News