టీఆర్‌ఎస్ హెచ్చరిక.. ఆ నేతలపై వేటుకు రంగం సిద్ధం!

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో నేతలు ఎవరికివారే యమునాతీరేగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి వచ్చింది

Update: 2022-04-19 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో నేతలు ఎవరికివారే యమునాతీరేగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి వచ్చింది. అది పార్టీకి భారీ నష్టం కలిగించే అవకాశం ఉందని భావించి కట్టడికి యత్నాలు చేపట్టింది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే వివరాలను ఇప్పటికే జిల్లా అధ్యక్షులతో సేకరించినట్లు సమాచారం. అదే విధంగా ఉద్యమకారులం అని సుప్రీంలా వ్యవహరిస్తే ఊరుకోబోమని, పార్టీ నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. పార్టీ నేతలు వివాదాల్లో తలదూర్చి వివాదస్పదం కాకుండా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపట్టేందుకు అధిష్టానం సన్నద్ధమైంది. పార్టీ కట్టుదాటేవారిపై వేటు వేయనుంది.

అధికార పార్టీ నేతలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భూ, వ్యాపార, ఆధిపత్యపోరు, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం.. ఇలా అన్నింటిలోనూ ఎంటర్ అవుతున్నారు. దీనికి తోడు శాసనసభ్యుల అనుచరుల ఆగడాలు సైతం పెరిగిపోతుండటం, వాటిని కట్టడి చేయడంలో ఎమ్మెల్యేలు వైఫల్యం అవుతున్న వివరాలను సైతం అధిష్టానం సేకరించింది. పాలన గాడితప్పుతున్న నియోజకవర్గాల వివరాలను సైతం తెప్పించుకున్నట్లు సమాచారం. సెకండ్ క్యాడర్ ఎదగకుండా మోనార్క్ గా వ్యవహరించే వారికి సైతం చెక్ పెట్టనుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కొందరు జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై కూడా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పనితీరును మెరుగుపర్చుకోని, వివాదస్పదం అవుతున్నవారిపై వేటువేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి మరింత పటిష్టత కోసం జిల్లా అధ్యక్షులను నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గాల వారీగా డేటాను సేకరించింది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తూ ఉన్నవారితో పాటు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలికి సంబంధించిన వివరాలను తెప్పించుకుంది. నియోజకవర్గాల్లో అంతర్గత పోరుతో సతమతమవుతున్న నేతల వివరాలను, మాజీ, తాజా నేతల మధ్య సమన్వయం, పార్టీ ఎలా ఉందనే వివరాలను సైతం అధ్యక్షులు అందజేశారు. నేతల మధ్య అంతర్గతపోరును పార్టీ సీరియస్ గా తీసుకుంది. దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం నియోజకవర్గాలకు సుప్రీం చేయడంతో ఆయా నియోజకవర్గాల పర్యటనకు మంత్రులు అనుమతితో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పర్యటనల సమయంలో అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ నేతలపై దిద్దుబాటు చర్యలకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది.

నియోజకవర్గాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనే వారిపై, ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనుకునేవారిపై చర్యలు తీసుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు సుప్రీం అనుకుంటే నడవదని పార్టీయే సుప్రీం అని హెచ్చరించారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదని, ఉద్యమం అయిపోయింది కాబట్టి 2014 నుంచి పార్టీ కార్యకర్తలే అని పేర్కొన్నారు. ఇది పార్టీ బలోపేతం, నేతల ప్రక్షాళలనకు తీసుకుంటున్న చర్యలను స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యేలువే నియోజకవర్గానికి రాజుకాదని కేటీఆర్ పేర్కొనడం పార్టీ నేతలను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొత్తనాయకత్వం ఎదగనీయడం లేదనే భావన అధిష్టానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కూడా గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:    

Similar News