‘ట్రిబ్యునల్’ అవసరమా?.. బిహార్ తప్పా మరే రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ

ధరణి స్థానంలో భూమాతను తీసుకొవస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Update: 2024-08-10 03:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి స్థానంలో భూమాతను తీసుకొవస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ల్యాండ్ కమిషన్ వేస్తామని, ప్రభుత్వ భూములు, పౌరుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది. ఇటీవల ఆర్వోఆర్ యాక్ట్ -2024 ముసాయిదాను పబ్లిక్ డొమెయిన్ లో పెట్టింది. ఈ డ్రాఫ్ట్ పై అనేక అభ్యంతరాలు, సూచనలు వస్తున్నాయి. అయితే ఇందులో అప్పీలు, రెవెన్యూ కోర్టుల వరకు మాత్రమే చెప్పి.. ట్రిబ్యునల్ గురించి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రిబ్యునల్ ఏర్పాటు పట్ల ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ట్రిబ్యునల్ అవసరమా అనే చర్చ కూడా నడుస్తున్నది.

‘ట్రిబ్యునల్స్’ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి?

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉన్నాయా? ఆర్వోఆర్ చట్టంలో ఈ అంశాన్ని చేర్చారా? ఈ అంశంపై భూమి సునీల్ ను ‘దిశ’ ఆరా తీయగా, పలు విషయాలు స్పష్టమయ్యాయి. మెరుగైన 18 ఆర్వోఆర్ చట్టాల్లో ఎక్కడా ట్రిబ్యునల్ లేదు. ఆర్ఓఆర్ చట్టానికి, రెవెన్యూ ట్రిబ్యునల్ కి అసలు సంబంధమే లేదు. ఆర్ఓఆర్ అనేది రికార్డులను తయారు చేసే వ్యవస్థ మాత్రమే. ఈ చట్టం ప్రకారం హక్కుల నిర్ధారణ జరగదు. రికార్డుల సవరణలో అధికారులు తప్పులు చేస్తే అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. అసైన్డ్, టెనెన్సీ, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్, ల్యాండ్ గ్రాబింగ్, అటవీ భూములపై వివాదాలు తలెత్తితే పరిష్కరించడానికి రెవెన్యూ కోర్టులు ఉంటాయి. అక్కడా పరిష్కారం లభించకపోతే సమస్యల తీవ్రతను బట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో బిహార్ లో మినహా మరెక్కడా రెవెన్యూ ట్రిబ్యునల్ లేదు. అక్కడ కూడా ఆర్వోఆర్ కి సంబంధించిన అంశాల ప్రాతిపదికన నడవడం లేదు. హక్కుల నిర్దారణ కోసమే. అందులోనూ రెవెన్యూ అధికారులే పని చేస్తున్నారు. పైగా ఆ ట్రిబ్యునల్స్ పెర్మినెంట్ గా నడుస్తున్నాయని సునీల్ తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో ట్రిబ్యునళ్లు ఇలా..

తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం -2020 కింద ఏర్పడిన ప్రత్యేక ట్రిబ్యునళ్లు అప్పటి దాకా పెండిండులో ఉన్న కేసుల పరిష్కారానికి మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,296 కేసులకు గాను రెండింటిని మాత్రమే పెండింగులో ఉంచారు. 16,294 కేసులను డిస్పోజ్ చేశారు. ఇందులో 1,851 కేసుల్లో మాత్రమే ఇరుపక్షాల వాదనలు విన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా తీర్పులు ఇచ్చారన్న అభియోగంపై హైకోర్టు పలు సూచనలు చేయడంతో మరోసారి వాదనలు విన్నది. అప్పటి ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దు చేసి తాత్కాలిక ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసింది. అది కూడా రెవెన్యూ అధికారులతోనే కావడం గమనార్హం. ఆ రెవెన్యూ ట్రిబ్యునళ్లలో చాలా వరకు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ జారీ చేసిన తీర్పులే అధికం. తమ వాదనలను వినాలంటూ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారితో రెవెన్యూ సిబ్బంది ఆ తీర్పును కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కేసుల్లో ఇరుపక్షాల వాదనలు వినాలి. కానీ తమ తీర్పు నచ్చకపోతే వాదనలను వినిపించేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిష్కారం కంటే రిజెక్ట్ ఫైళ్లే ఎక్కువ. ఇక్కడ రెవెన్యూ ట్రిబ్యునళ్ల వల్ల కలిగిన ప్రయోజనం నామమాత్రమే.

‌‌నాలుగంచెల పరిష్కారం

కొత్త చట్టం ప్రకారం రికార్డుల సవరణకు నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పడుతుంది. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్/కలెక్టర్, సీసీఎల్ఏ ఉంటారు. అప్పీల్ వ్యవస్థలోనూ ఇదే నడుస్తుంది. ఈ సమస్యల పరిష్కారానికి చట్టంలో నిర్దేశిత అధికారి (ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్) నిర్దేశిత కాలం వరకు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఒక్కో సమస్యను ఏ స్థాయిలో, ఏ అధికారి, ఎంత కాలంలో పరిష్కరించాలని అంశం చట్టంలో లేదు. ఇది మార్గదర్శకాల ద్వారానే వెల్లడవుతుంది. చట్టంలోనే అది పేర్కొనడం ద్వారా చేర్పులు, మార్పులకు వీలుండదు. దరఖాస్తులు, సమస్యల సంఖ్య తీవ్రమైనప్పుడల్లా మార్చుకునే వెసులుబాటు కలిగిచేందుకు చట్టంలో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని పరిమితం చేశారు. అప్పీల్ వ్యవస్థ ద్వారా దాదాపు న్యాయం పొందే వీలుంటుంది. ఆ తర్వాతే కోర్టుకు వెళ్లొచ్చు.

ప్రతి శనివారం రెవెన్యూ కోర్టులు పని చేస్తే..

గతంలో కోనేరు రంగారావు సిఫారసుల ప్రకారం రెవెన్యూ కోర్టులు నడిచేవి. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో కొనసాగేవి. ఇప్పుడవి పకడ్బందీగా పని చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నడిపిస్తున్నారు. అలాగే ఆర్డీవో, అదనపు కలెక్టర్/కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి శనివారం రెవెన్యూ కోర్టులు నడిచేలా వ్యవస్థను రూపొందించాలి. పని ఒత్తిడి ఎంత ఉన్నా భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతుందని పలువురు అడ్వకేట్లు సూచిస్తున్నారు. అలాగే దరఖాస్తుల పరిష్కారంలో ఒక శాతం ప్రకారం తహశీల్దార్, ఆర్డీవో కలెక్టర్ తప్పనిసరి తనిఖీ చేయాలన్న నిబంధన కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల్లో ఉంది. దాని అమలుకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు జీవోలు కూడా తీసుకొచ్చారు. వాటిని ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా కింది స్థాయి అధికారులు తప్పు చేసే అవకాశం కాస్తయినా తగ్గుతుంది. రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. చట్టంలో దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేసేటప్పుడు సామాన్య రైతు కోణంలో ఆలోచించాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News