మా సమస్యలను పరిష్కరించండి.. మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా

తమ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) బృందం కోరింది.

Update: 2024-06-28 13:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తమ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) బృందం కోరింది. శుక్రవారం ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్‌ల బృందం మంత్రిని కలిసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లను సొంత జిల్లాలకు తిరిగి పంపాలన్నారు. అయితే ఈ నెలలో పదవీ విరమణ పొందే ఏడుగురు తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపుతూ ఆర్డర్ జారీ చేశారు. బాలానగర్ మండల గిర్దావర్ వెంకట్ రెడ్డి సస్పెన్షన్ నిలుపుదల వంటి అంశాలను మంత్రితో చర్చించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు ఈ నెలలో పదవీ విరమణ పొందే తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపే ఉత్తర్వులు జారీ అయ్యేటట్లు చేశారు. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆర్ఐ సస్పెన్షన్‌ను వారంలోపు నిలుపుదల చేస్తామన్నారు. బదిలీలను చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ట్రెసా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు చెన్న కిష్టన్న, కార్యదర్శి రాజ్ గోపాల్, జగిత్యాల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News