బదిలీ అయిన వారికి జూలై జీతం అందలేదు: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి

ఈ ఏడాది జూలైలో సర్కార్ టీచర్లకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, సాధారణ బదిలీలు చేపట్టిందని, అయితే బదిలీ అయిన టీచర్లకు జూలై నెల జీతం ఇప్పటికీ అందలేదని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-08 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది జూలైలో సర్కార్ టీచర్లకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, సాధారణ బదిలీలు చేపట్టిందని, అయితే బదిలీ అయిన టీచర్లకు జూలై నెల జీతం ఇప్పటికీ అందలేదని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీ అయిన సదరు ఉపాధ్యాయులు తమ కొత్త పాఠశాలల్లో చేరేటప్పటికీ జీత భత్యాల బిల్లులను ఆయా జిల్లాల ట్రెజరీలకు పంపాల్సిన గడువు క్లోజ్ అయిందని, దీంతో వాటిని సప్లిమెంటరీ బిల్లుల రూపంలో ఆ తర్వాత నెలల్లో జిల్లాల ట్రెజరీలకు విద్యాశాఖ సమర్పించిందని తెలిపారు. ఇప్పటికీ మూడు నెలలు పూర్తయినప్పటికీ జూలై జీతాల సప్లిమెంటరీ బిల్లులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంజూరు చేసి ఆయా ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయకపోవడం శోచనీయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతి పెద్ద పండుగ అయిన దసరాకు ముందయినా తమ జీతాలు అందుతాయోమోనని ఉపాధ్యాయులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అయినా ఉద్యోగులకు ఉపశమనం కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లుగా కనపడటం లేదని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏవీఎన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Similar News