టాంక్‌బండ్‌పై బతుకమ్మ గ్రాండ్ ఫినాలె.. హాజరు కానున్న సీఎం రేవంత్

బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 10న సద్దుల బతుకమ్మతో కంప్లీట్ అవుతున్నందున ముగింపు వేడుకలను గ్రాండ్ ఫినాలే పేరుతో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

Update: 2024-10-08 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 10న సద్దుల బతుకమ్మతో కంప్లీట్ అవుతున్నందున ముగింపు వేడుకలను గ్రాండ్ ఫినాలే పేరుతో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వివిధ విభాగాల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి... ప్రోగ్రామ్ షెడ్యూలు ప్రకారం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యలనూ సిటీ పోలీసు కమిషనర్ సహా పలువురితో రివ్యూ చేశారు. ముగింపు వేడుకల్లో దాదాపు పదివేల మంది మహిళలు పాల్గొంటున్నారని, 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం (అమరజ్యోతి) నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంటారన్నారు. వీరితోపాటు వందలాది మంది కళాకారులు వేర్వేరు కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే వేదిక దగ్గర బతుకమ్మ ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని, బతుకమ్మల నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్కుల నుంచి ఫైర్ వర్క్స్ (బాణసంచా), లేజర్ షో (ప్రదర్శన) ఉంటుందని పేర్కొన్నారు. గ్రాండ్ ఫినాలేకు పండుగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించనున్నట్టు తెలిపారు. సిటీలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్కులోని బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డు (పీవీఎన్ మార్గ్)లో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.

అమరవీరుల స్మారక కేంద్రం (అమరజ్యోతి) నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రతీ శాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వాణీప్రసాద్, దాన కిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Similar News