ఎస్సీ వర్గీకరణ అమలుకు లీగల్ చిక్కులు రాకుండా ప్లాన్

ఎస్సీ వర్గీకరణ అమలుకు లీగల్ చిక్కులు రాకుండా పకడ్బందీ విధానానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్న కేబినెట్ సబ్ కమిటీ.. సచివాలయంలో మంగళవారం

Update: 2024-10-08 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అమలుకు లీగల్ చిక్కులు రాకుండా పకడ్బందీ విధానానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్న కేబినెట్ సబ్ కమిటీ.. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన నాల్గవ సమావేశంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయిన జడ్జి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ సిఫారసును రానున్న కేబినెట్ సమావేశం ముందు ఉంచాలని తీర్మానం చేసింది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ నుంచి కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేరుతో కొన్ని సూచనలు వచ్చినట్లు సబ్ కమిటీ పేర్కొన్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియపై రివ్యూ చేస్తున్న సందర్భంగా కమిటీకి కుల, ప్రజా సంఘాల నుంచి మొత్తం 1,082 అభిప్రాయాలు వచ్చినట్లు అధికారులు వివరించారు. విద్య, ఉద్యోగ అంశాల్లో ఎస్సీ వర్గీకరణకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పకడ్బందీ చట్టాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సమంజసం అనే అభిప్రాయం ఈ సమావేశంలో వెల్లడైంది.

ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో తెలంగాణ అధికారులు పర్యటించి పూర్తి వివరాలను సేకరించారని, దాని ద్వారా కలుగుతున్న లబ్ధి కూడా అధ్యయనం చేశారని మంత్రి ఉత్తమ్ ఈ సమావేశంలో వివరించారు. తమిళనాడులో 2009లోనే తమిళనాడు అరుంధతీయార్ (స్పెషల్ రిజర్వేషన్) చట్టం వచ్చిందని, దాని ఆధారంగా ఆది ద్రావిడర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు నుంచి జీవో (నెం 50) కూడా విడుదలైందని తెలిపారు. జస్టిస్ ఎంఎస్ జనార్థనం నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పడిందని, అరుంధతీయార్, చక్కలియాన్, మదారి తదితర కులాలను వర్గీకరించడంతో 2009 నుంచే వర్గీకరణ విధానం అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. పంజాబ్‌లో మొత్తం 39 ఎస్సీ కులాలు, ఉప కులాలు ఉంటే అందులో బాల్మీకీ, మృబీ సిక్కుల (ఎస్సీ జనాభాలో 40%)ను ఒక గ్రూపులోకి తెచ్చి మొత్తం 25% ఎస్సీ రిజర్వేషన్‌లో సగం (12.5%) కేటాయించి మిగిలిన 37 ఎస్సీ కులాల (ఎస్సీ జనాభాలో 60%)ను మరో గ్రూపులో పెట్టి 12.5% చొప్పున అమలు చేస్తున్నట్లు తెలిపారు. హర్యానాలో పర్యటించాలనుకున్నా అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్లు వివరించారు.

రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు, స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ట్రాన్స్ కో తదితర ప్రభుత్వ విభాగాలను ఉద్యోగాల భర్తీలో ఇప్పటికే రెడీగా ఉన్న ఎస్సీ ఉపకులాల డేటాను ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి తెలియజేశారు. ఫైనాన్స్ డిపార్టుమెంటు నుంచి ఇప్పటికే 30% డాటా వచ్చిందన్నారు. 2011 జనాభా లెక్కలనే ఎస్సీ వర్గీకరణకు ప్రామాణికంగా తీసుకోవాలని సబ్ కమిటీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే సబ్ కమిటీ జిల్లాలవారీ పర్యటన చేసి వర్గీకరణపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యురాలైన మంత్రి సీతక్క మాట్లాడుతూ, నిర్దిష్ట డెడ్‌లైన్ పెట్టుకుని వర్గీకరణ అధ్యయనాన్ని కంప్లీట్ చేయాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, జ్యుడిషియల్ కమిషన్ సోషల్ జస్టిస్ స్ఫూర్తిని ప్రతిబింబించడంతో పాటు కోర్టుల్లో వివాదాలకు తావులేని రీతిలో ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు.

జిల్లాల్లో సబ్ కమిటీ పర్యటించి సేకరించిన అభిప్రాయాలను విశ్లేషించడానికి సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) విశ్లేషిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ బీసీ కమిషన్ ఎలాగూ కులగణన చేపడుతున్నదని, దీనితో పాటే బీసీల ఆర్థిక వెనకబాటుతనం (సోషియో ఎకనమిక్ సర్వే)పైనా స్టడీ చేయాలని మంత్రి ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్టడీ జరిగితే ఓటర్ల వివరాలు ఎస్సీ వర్గీకరణకు కూడా దోహదపడతాయన్నారు. రాష్ట్ర హైకోర్టు డిసెంబరు 9 డెడ్‌లైన్ పెట్టినందున అప్పటికల్లా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపైనా కొంత స్పష్టత వస్తుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వొకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి, ఎస్సీ అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ సెక్రెటరీ లోకేష్ కుమార్, పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సర్వే చేపట్టడంలో అవలంబించాల్సిన విధానాలు, ప్రస్తావించాల్సిన టెక్నికల్ అంశాలు, ప్రొఫార్మా, చట్ట పరిమితి, నోడల్ ఏజెన్సీ బాధ్యతలు.. ఇలాంటివాటిని వివరించారు.


Similar News