ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Update: 2024-10-08 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా,మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురైందన్నారు. బడే భాయ్ నోట్ల రద్దుతో ఏం తప్పు చేశారో ఇక్కడ చోటా భాయ్ హైడ్రా విషయంలో తప్పు చేశారన్నారు. హైడ్రా ఎవరి మీద కక్షతో తెరపైకి తెచ్చారు.. మూసీ సుందరీకరణ ఎవరి కోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా,మూసీ వచ్చిందని దుయ్యబట్టారు. లక్షా 50 వేల కోట్లు అని ఎవరు చెప్పారని డిప్యూటీ సీఎం అంటున్నారని, మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా? చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? అని సవాల్ చేశారు. మీ చేతికి అధికారం వచ్చాక ఏం జరిగిందో చర్చకు రెడీనా? ఎఫ్‌టీఎల్ లో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము నీకు, నీ ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు.

మూసీ తో లక్ష కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని, ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లు కూల్చారని మండిపడ్డారు. డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో భట్టి రేవంత్ రెడ్డిని మించిపోతున్నారన్నారు. డబ్బులు సంపాదించడంలో భట్టి సీఎం తో పోటీ పడుతున్నారని, బుకాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. మూసీపై ప్రణాళిక మీ దగ్గర ఉందా? అని ప్రశ్నించారు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ కు నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.


Similar News