సంక్రాంతి లోపు లెవల్-5 ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్దమైంది. వారం రోజుల్లో లెవల్-5 ఉద్యోగుల బదిలీలను చేపడుతారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్దమైంది. వారం రోజుల్లో లెవల్-5 ఉద్యోగుల బదిలీలను చేపడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీడీ), కేంద్ర కార్యాలయంలో పనిచేసే ప్రాజెక్టు మేనేజర్ (పీఎం)లు లెవల్-5 పరిధిలోకి వస్తారు. వీరి బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంక్రాంతి పండుగ తరువాత మిగిలిన ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు చేపడుతారు. ఖాళీగా ఉన్న స్థానాలను పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే అంత మంది ఉద్యోగుల బదిలీలు చేపడతారు. ఫిబ్రవరి, మార్చిలో బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియను అంతా మార్చి 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెర్ప్ పరిధిలో మొత్తం 3,974 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఏడేళ్లుగా బదిలీలు లేవు. కొత్త జిల్లాలు ఏర్నాటైనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన బదిలీలు చేశారు. ఆ తర్వాత మళ్లీ బదిలీలు జరగలేదు. దీంతో గత కొన్ని నెలలుగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పదోన్నతులు, బదిలీలను చేపట్టింది.