పదేళ్ల ప్లాన్‌లో టీపీసీసీ.. ‘లోకల్‌’పైనే టార్గెట్

సీనియర్ నేతలను ఇన్‌చార్జి మంత్రులు కోఆర్డినేట్ చేస్తుండగా, నియోజకవర్గం, మండల స్థాయి లీడర్లను సమన్వయం చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీలు వేయనున్నారు.

Update: 2024-09-22 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో పాత, కొత్త లీడర్లను బ్యాలెన్స్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తున్నారు. సీనియర్ నేతలను ఇన్‌చార్జి మంత్రులు కోఆర్డినేట్ చేస్తుండగా, నియోజకవర్గం, మండల స్థాయి లీడర్లను సమన్వయం చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఇందుకోసం టీపీసీసీ జిల్లాల వారీగా పేర్లు సేకరిస్తున్నది. ఈ కమిటీలు పాత కార్యకర్తలను కాపాడుకుంటూనే కొత్తోళ్లతో సమన్వయం చేయనున్నాయి. అందరినీ సమిష్టిగా ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చి పార్టీ బలోపేతం కోసం కృషి చేయనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సిస్టమ్‌ను తీసుకొని రానున్నారు. పదేళ్ల పవర్ కోసం పట్టుసాధించాలంటే ఈ విధానం అమలు చేయాల్సిందేనని పలువురు పార్టీ లీడర్లు ఇటీవల కొత్త పీసీసీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఆదేశాల మేరకు టీపీసీసీ కమిటీల ఏర్పాటుకు తీర్మానించింది. పార్టీ ఆదేశాలను పాటించని వారిపై నిబంధనల ప్రకారం వేటు వేయాలని టీపీసీసీ స్పష్టం చేసింది. ఏ స్థాయి లీడరైనా పార్టీ రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తీసుకోనున్నారు. త్వరలోనే పీసీసీ నుంచి అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు వెళ్లనున్నాయి.

జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల మీటింగులు నిర్వహించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, మరో నేత విశ్వనాథన్‌లు పాల్గొని జిల్లాల్లోని పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కావ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేణుగోపాల్, ఎంపీ వంశీ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.

ఆఫీసర్లపై ముకుమ్మడి ఫిర్యాదులు ?

గాంధీభవన్ వేదికగా ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మాట వినడం లేదని పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్‌కు కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్‌తో పాటు డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర అంశాల్లో తమకు రెస్పాన్స్ అవడం లేదని వివరించారు. గడిచిన ఏడు నెలల నుంచి ఇది పదే పదే రిపీట్ అవుతున్నదన్నారు. కొందరు ఆఫీసర్లు ఎంత చెప్పినా తమను కేర్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొందరు అధికారులు బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. పీసీసీ చీఫ్​దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించాలని ఎమ్మెల్యేలంతా నొక్కి చెప్పడంతో పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు నాయకత్వం వహించే నాయకులకు గౌరవం దక్కాలని, ఆ దిశగా కృషి చేయని ఆఫీసర్ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు గెట్ రెడీ..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఎలక్షన్స్ ఏ టైంలో వచ్చినా విజయం సాధించేందుకు రెడీగా ఉండాలని నొక్కిచెప్పింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చేసిన వర్క్ కంటే అదనంగా కష్టపడాలని సూచించింది. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్లని, వాళ్లను రక్షిస్తేనే నాయకుల మనుగడ ఉంటుందని టీపీసీసీ వివరించింది. వాళ్ల గెలుపును భుజాలపై మోయాల్సిన బాధ్యత సీనియర్ నేతలందరిపైనా ఉన్నదని కొత్త పీసీసీ అధ్యక్షులు సూచించారు. పార్టీ మైలేజ్ మరింత పెరగాలంటే ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడూ తిప్పికొట్టేలా పార్టీ టీమ్స్ సిద్ధంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా టీమ్‌లు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం గాంధీభవన్‌లోని వార్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు


Similar News