కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పవర్‌లోకి వచ్చినట్లే: రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి అదానీకి ప్రజాధనం దోచిపెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి అదానీకి ప్రజాధనం దోచిపెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాధనం లూటీ చేయడం వల్లే అదానీ సంపద పెరిగిందని ఆరోపించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతరు సంస్థలను అదానీ మోసం చేశారని అన్నారు. కృత్రిమంగా షేర్ల విలువ పెంచి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారని ఆరోపించారు. అవినీతి చేయడం వల్ల అదానీకి చెందిన రూ.11 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని తెలిపారు. ఈ విషయాలన్నీ పార్లమెంట్‌లో మాట్లాడితే అన్ని బయటకు వస్తాయనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ, అమిత్ షా రాహుల్ గాంధీపై కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాయతీ గల కుటుంబం నుండి వచ్చాడన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో వచ్చినట్లేనని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై టీ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతోనే ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. పేపర్ల లీకేజీపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఏప్రిల్ 25న సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్‌లో భారీ నిరుద్యోగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.