TJS: అమిత్ షా వ్యాఖ్యలపై టీజేఎస్ నిరసన..స్టేట్ ఆఫీస్ వద్ద దిష్టిబొమ్మ దహనం
పార్లమెంట్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (Ambedkar)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా గురువారం తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ ఆఫీస్ వద్ద (TJS) పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు ఎం. నర్సయ్య మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా, దేశ సమానత్వ స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. దేశ ప్రజలు ఎప్పటికీ ఆయన సేవలను గౌరవంతో స్మరించుకుంటారు.
అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ, సబ్బండ వర్గాలను అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయనను హోం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.టీజేఎస్ నాయకుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఇది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమన్నారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.జె.ఎస్ నాయకులు బట్టల రాంచందర్, మనేపల్లి లక్ష్మణ్, పుష్పానీల గౌడ్, జైపాల్ రెడ్డి, హన్మంతు గౌడ్, రంజిత్ కుమార్, మాణిక్యం, భాస్కర్, భూషణ్, సురేష్ కుమార్, సయ్యద్ అబ్రార్, కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.