Teenmar Mallanna: గ్రూప్ -1 పరీక్ష ముందుకు పడదు.. రేవంత్ సర్కార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

రేవంత్ సర్కార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 10:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జీవో 29 వివాదం వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్ భవన్ లో బీసీ సంఘం ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని పార్టీల్లోని అన్ని బీసీ సంఘాల నాయకులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. జీవో 29 వద్దని చెబుతున్నా అదే జీవో ప్రకారం ఇవాళ ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని నా అంచనా ప్రకారం గ్రూప్ -1 పరీక్షలు ముందుకు వెళ్లే పరీక్షలేమి కావని అటు ఇటు ఊగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలోనే ఈ సమస్యను గవర్నర్ కు వివరించినా ఇవాళ మరోసారి కలిసి గవర్నర్ కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. పదే పదే పరీక్షలు వాయిదా పడటం వల్ల అభ్యర్థుల మనోధైర్యం దెబ్బతినేలా ఉందని అందువల్ల కోర్టు కేసుల పరిష్కారం తర్వాతే పరీక్షలు నిర్వహించే విషయాన్ని గవర్నర్ కు నివేదించామన్నారు. కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాల ప్రజల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇది బీసీల కంచంలో నుంచి కూడు లాక్కోవడమే అన్నారు. ఈ విషయంలో తాను ఇప్పటి వరకు సీఎంకు మూడు సార్లు, గవర్నర్ కు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చానన్నారు. ఇంకా అవకాశం ఉన్నప్రతిచోటా రిప్రజెంటేషన్లు ఇస్తామన్నారు. అయితే మా ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా ఇలాగే మొండిగా ముందుకు వెళ్తామంటే ఇది మీ అందరి రాజకీయ సమాధికి నాంధి పలుకుకుందని హెచ్చరించారు. ఇప్పటికే బీసీలమంతా ఏకమయ్యామని, మా నాయకుడు రాహుల్ గాంధీ ఆశయాలను తెలంగాణలో నెరవేర్చబోతున్నామన్నారు. ఈ ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేసినా లేక ప్రభుత్వంలోని ఎవరూ పని చేస్తే మేమంతా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాహుల్ గాంధీ తలదించుకునే పనులు ఎవరు చేసినా అంగీకరించబోమన్నారు. ఓ వైపు రాహుల్ గాంధీనే జనాభా దామాషా రిజర్వేషన్లు ఉండాలని చెబుతుంటే ఇక్కడ అలా జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమన్నారు. గవర్నర్ చర్యలు తీసుకుంటామని నమ్ముతున్నామని చెప్పారు.

ఇదో చీకటి జీవో: జాజుల శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక విధానం మార్చుకోవాలని లేకుంటే మాజీ సీఎం కేసీఆర్ కు ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గవర్నర్ ను కలిసిన అనంతరం బీసీ సంఘం నాయకులు చెరుకు సుధాకర్, పల్లె రవి తదితరులతో మీడియాతో మాట్లాడిన ఆయన.. జీవో 29 ఓ చీకటి జీవో అని, ఇది బీసీల బతుకులను నాశం చేసే జీవో అన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా ప్రధానంగా బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నద్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దమాషా రిజర్వేషన్లు ఉన్నాయని, ఈడబ్లూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. జీవో 29 రద్దు చేయకుంటే రేపు అగ్రవర్గాల వారే అన్ని చోట్లా అధికారులుగా ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ జీవోపై రాష్ట్రమంతా అట్టుడుకుతోంది. విద్యార్థి లోకమంతా మాకు అన్యాయం జరుగుతోందని ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్చలకు పిలవడం లేదన్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మార్పు అంటే ఇదేనా? అని నిలదీశారు. విద్యార్థులేమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. అభ్యర్థులను సెక్రటేరియట్ కు పిలిపించి సీఎం, మంత్రులు ఎందుకు చర్చలు జరపడం లేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. ఇటీవలే టీచర్ ఉద్యోగాలు ఇదే తరహాలో అగ్రవర్గాలకు కట్టబెట్టారని ఇప్పుడు గ్రూప్-1 ఉద్యోగాలు కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని సహించేది లేదన్నారు.


Similar News