Vishweshwar Reddy: ఆ రెండు పార్టీలు ఎంఐఎంకు భయపడుతున్నాయి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒకరికి మరొకరు పరస్పరం అవసరమని, బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్కర్ రెడ్డి అన్నారు. కవిత బెయిల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిందని పలు దినపత్రికలలో వచ్చిన కథనాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభావంతో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదని, అయితే సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ అసహ్యకరమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదని ఆరోపణలు చేశారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లోకి జంప్ అయ్యారని, ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. అలాగే హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులకు బీఆర్‌ఎస్ ప్రజలు డబ్బులు చెల్లించారని, ఈ రెండు కుటుంబ పార్టీలేనని, ఎంఐఎం పార్టీకి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ భయపడుతున్నాయని విమర్శించారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మొదటి షెడ్యూల్డ్ తెగ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీకి వ్యతిరేకంగా ఓటు వేశాయని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒకరికి మరొకరు పరస్పరం అవసరమని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.