ఈ సారి పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయింది : కేటీఆర్

Update: 2024-10-09 09:52 GMT

దిశ, వెబ్ డెస్క్ :  ఈ పండుగ సమయంలో ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవని, ఈ సారి దసర, బతుకమ్మ పండుగ.. పండుగ లెక్క లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా డీజేలు కూడా నిషేదించారని, పండుగ జరుపుకోకుండా భయానక వాతావారణం సృష్టించారన్నారు. వరంగల్ లో ఓ ఎమ్మార్వో ను బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళితే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని వాళ్లను తరమికొట్టారన్నారు. యూపీలోని బుల్డోజర్ సంస్కృతిని తెలంగాణలో కూడా తీసుకొచ్చారని విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న ఆఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను తలచుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ పది నెలల వాళ్ల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420హామీల అమలుకు పైసలు లేవని చెబుతూ మూసీ కోసం మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడటని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం పైసలు ఇస్తే ప్రజలు కమీషన్ లు ఇవ్వరు కదా అని, అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చని, రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చని కాంగ్రెస్ ఆలోచన అని కేటీఆర్ ఆరోపించారు. మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటదన్నారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అక్రమంగా భూములు గుంజుకోవద్దంటూ మా పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేస్తే, సీఎం రేవంత్ సూచన మేరకు పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని, అక్కడ రైతుల మీద లాఠీ ఛార్జి చేశారని విమర్శించారు. సీఎం తన కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజలను ఒప్పించకపోతే రాష్ట్రాన్ని ఎట్ల నడిపిస్తావని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని అరాచకాలు చేస్తావని, ప్రజాభిప్రాయం మేరకే వాళ్లను ఒప్పించి, మెప్పించి ఏ పరిశ్రమ అయిన పెట్టాలన్నారు. మా పార్టీ నేత నరేందర్ రెడ్డి గారితో సహా అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News