Kodanda Reddy: 'సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు'.. కోదండరెడ్డి హాట్ కామెంట్స్
హైడ్రా విషయంలో ప్రతిపక్షాల తీరుపై కోదండరెడ్డి విమర్శలు గుప్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా విషయంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు విచిత్రంగా మాట్లాడుతున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అని, వారి మాటలు ఈ నగరంలోని చెరువులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రా విషయంలో ముఖ్యమంత్రిని ఇ్బబంది పెట్టే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని దయచేసి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైడ్రా ఏర్పాటుపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చెరువుల కబ్జాలను ఆపలేకపోయిందో చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో తానే స్వయంగా చెరువుల కబ్జాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు.