విద్యుత్ వినియోగదారులపై భారం
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై మరింత భారం పడనుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై మరింత భారం పడనుంది. 2023-24 ఏడాదికి గాను అడిషనల్ సర్ చార్జ్ గా కిలోవాట్ కు రూ.0.39 పైసలు వసూలు చేయనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆరు నెలలు వినియోగదారులను పిండుకునే అవకాశాన్ని ఈఆర్సీ కల్పించింది. అయితే డిస్కంలు ఈఆర్సీకి వేసిన పిటిషన్ లో ఉన్నంత మొత్తం కాకుండా అతి తక్కువగా పెంపునకు ఒకే చిప్పినా నిరుపేద వినియోగదారులపై ఈ భారం పడనుంది. ఇదిలా ఉండగా ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని డిస్కంలకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటరీ రెగ్యులేటరీ కమిషన్ ఝలక్ ఇచ్చినట్లయింది.
అడిషనల్ సర్ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పిండుకుని నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలనుకున్న డిస్కంలకు ఈఆర్సీ షాకిచ్చింది. సంస్థ నష్టాలను తగ్గించుకునేందుకు టీఎస్ ఎస్పీడీసీఎల్, ఎన్పీ డీసీఎల్ సంస్థలు రూ.9.86 వసూలు చేయాలని ఈఆర్సీకి పిటిషన్ వేశాయి. కాగా దీనిపై బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్సీ పెంపుపై స్పష్టతనిచ్చింది. డిస్కంలు రూ.9.86 పెంచాలని పిటిషన్ వేయగా కిలోవాట్ కు రూ.0.39 పైసల పెంపునకు మాత్రమే అవకాశం కల్పించింది. దీంతో నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలనుకున్న డిస్కంలకు షాక్ తగిలినట్లయింది.