Minister Komati Reddy : ధరణిలో చాలా అక్రమాలు జరిగాయి

నల్గొండ పట్టణం,గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-09-24 14:05 GMT

దిశ,నల్గొండ: నల్గొండ పట్టణం,గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డిని ఆదేశించారు. మంత్రి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష 116 రూపాయలుల చొప్పున 117 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం, ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి, కనగల్, తిప్పర్తి మండలాల నుంచి నల్గొండ తహసిల్ పరిధిలో గ్రామాలు కలవడం, నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

నల్గొండకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని రూ. 25 లక్షల ఎం ఎల్ ఏ ఎస్ డి ఎఫ్ నిధులతో పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, టాయిలెట్స్ తో పాటు, అన్ని గదులను ఆధునీకరించడం,ఏ సి సౌకర్యం, అవసరమైన సౌకర్యాలు అన్నింటిని కల్పించాలని, ఇందుకు అంచనాలను రూపొందించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని, రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ముందు ఉందని తెలిపారు.

ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా,జిల్లా కలెక్టర్ చొరవతో వాటిని పరిష్కరించి ఆ సంఖ్యను 4000 కు తీసుకురావడం జరిగిందని, ప్రత్యేకించి నల్గొండ తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించి 1400 దరఖాస్తులలో 1100 ఇదివరకే పరిష్కరించడం జరిగిందని, తక్కినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని. వీటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం సాధ్యమైనంతవరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకుగాను ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇన్చార్జ్ ఆర్డిఓ ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు మంత్రి వెంట ఉన్నారు.


Similar News