పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు బస్టాండే: మాజీ మంత్రి కేటీఆర్

రైతు భరోసా లేదు.. ముఖ్యమంత్రి కుర్చీ కి భరోసా లేదు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని స్పష్టం చేశారు.

Update: 2024-09-24 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు భరోసా లేదు.. ముఖ్యమంత్రి కుర్చీ కి భరోసా లేదు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని స్పష్టం చేశారు. పార్టీ ఏం పాపం చేసిందని ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. గరీబోళ్ల కు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు.. వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. మాదాపూర్ లో తిరుపతి రెడ్డి కమీషన్ల దుకాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పాడని, శేరిలింగంపల్లి లో ఉప ఎన్నిక ఖాయం.. బీఆర్ఎస్ గెలుపు పక్కా అని జోస్యం చెప్పారు.

హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో క్లీన్ స్వీప్ చేశామని, కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని ఆటో డ్రైవర్లు, బస్తీ వాసులు, పేదలపై సీఎం పగ బట్టాడన్నారు. బీఆర్ఎస్ కన్‌స్ట్రక్షన్ చేస్తే... సీఎం మాత్రం డిస్ట్రక్షన్ చేస్తుండని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్‌లు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలను బీఆర్ఎస్ నిర్మిస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం 9 నెలల్లో బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్ మెయిలు చేస్తున్నాడని ఆరోపించారు. నాగార్జునకు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారు మంచిదే... కానీ పర్మిషన్ ఇచ్చిందెవరు అని నిలదీశారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు కూలగొట్టాలని డిమాండ్ చేశారు. పేదవాళ్లకు ఎవరు అండగా లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా? అని ప్రశ్నించారు. నీకు నీతి ఏమైనా ఉందా? మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయని, చిత్తశుద్ది ఉంటే ఆ ఇళ్లను పేదవాళ్లకు ముందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహిస్తామని, వాళ్లకు అండగా ఉంటే కార్యక్రమాలను కేసీఆర్ పర్మిషన్ తో చేపడతామని వెల్లడించారు.

శ్రీధర్ బాబు అతి తెలివితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని అంటున్నారని, మరి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మనం మనోడు కాదంటున్నాం... వాళ్లు మనోడు కాదంటాడు... వాళ్ల బతుకు ఎటు కాకుండా పోయింది’ అని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే మేము ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పి మంచి పనులు చేస్తే ఉప ఎన్నికలు పెట్టి గెలువాలని సవాల్ చేశారు. ఆడపిల్లలకు తులం బంగారం, యువతకు ఉద్యోగాలు అని నమ్మించి మోసం చేశారన్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకొచ్చి ఏటా 2 లక్షల ఉద్యోగాలంటూ నమ్మబలికారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు. ముఖ్యమంత్రి బంధువులు, సీఎం చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నదన్నారు. ఇప్పటి వరకు ఈ సీఎం ఢిల్లీకి 23 సార్లు పోయాడని, రాష్ట్రంలో మాత్రం ఒక్క కొత్త పథకం కూడా పెట్టలేదన్నారు. కార్యకర్తలకు ఏ బాధ వచ్చిన సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వస్తామని, కొత్తగా కమిటీలు వేసుకుందామని స్పష్టం చేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ గెలవటం ఖాయమన్నారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని, చిట్టి నాయుడు ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.


Similar News