'పోరాడితే పోయేదేం లేదు’.. పార్టీ మార్పు ప్రచారం వేళ రంజిత్ రెడ్డి సంచలన ట్వీట్..

బీఆర్ఎస్ పార్టీలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-03-14 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ పార్టీలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ గులాబీ పార్టీలో దుమారం రేపుతున్నయి. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ రంజిత్ రెడ్డి “పోరాడితే పోయేదేం లేదు” అంటూ ట్విట్టర్ వేదికగా గురువారం చేసిన పోస్ట్ సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 'పోరాడితే పోయేదేం లేదని ప్రముఖ తత్త్వవేత్త కార్ల్ మార్క్స్ ఏనాడో మనకు చెప్పాడు. ఈ రోజు ఆ మహనీయుడి వర్థంతి. ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే మనం ఆయనకిచ్చే నిజనమైన నివాళి'. అంటూ రంజిత్ రెడ్డి రాసుకొచ్చాడు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే రంజిత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం అందులో పోరాటానికి సంబంధించిన లైన్ మెన్షన్ చేయడం చర్చగా మారింది.

పోరాటం కేసీఆర్ పైనేనా?:

పోరాడితే పోయేదేం లేదంటూ రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన పార్టీ మారి కేసీఆర్ పై పోరాటం చేయబోతున్నారని అందులో భాగంగానే ఈ ట్వీట్ చేసి ఉంటారా అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి చేవెళ్ల అభ్యర్థిగా బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి పేరును అందరికంటే ముందే ప్రకటించింది. కానీ రంజిత్ రెడ్డి మాత్రం పోటీ చేయనని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక రెండు రోజుల క్రితం చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేసేందుకు కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి సైతంఎంపీ జి.రంజిత్ రెడ్డి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ పెరిగిపోయిందని ఇక ఆయన కారు దిగి హస్తం గూటికి చేరడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చేవెళ్ల స్థానానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని పేర్లు ఖరారు కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా రంజిత్ రెడ్డి కోసం ఆమె పేరును కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News