ప్రభుత్వాన్ని అస్థిర‌ప‌రిచే కుట్ర జరుగుతోంది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప‌రిపాల‌న‌ను అస్ధిర‌త ప‌ర‌చాల‌న్న కుట్ర జ‌రుగుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2024-11-14 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప‌రిపాల‌న‌ను అస్ధిర‌త ప‌ర‌చాల‌న్న కుట్ర జ‌రుగుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయామ‌న్న అక్కసుతో అమాయ‌కులైన రైతుల‌ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. చిల్లర, అవ‌కాశ‌వాద, కుట్రపూరిత రాజ‌కీయాల‌తో మ‌నుగ‌డ సాగించ‌లేర‌నే విష‌యాన్ని బీఆర్ఎస్ గుర్తించాల‌ని హిత‌వు ప‌లికారు. పార్టీ ఉనికి కోసం అమాయ‌క రైతుల‌ను బలిచేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో ఎవ‌రినీ ఉపేక్షించ‌బోమ‌ని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై దాడి చేయడం దారుణమన్నారు. జిల్లా క‌లెక్టర్, ఇత‌ర అధికారుల‌పై రాళ్లు, క‌ర్రలతో దాడి చేశారంటే దాని వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందనే విషయం అర్ధం అవుతుందన్నారు. రైతుల సమస్యలు, స్ధానికుల‌ సమస్యలు విన‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతుల‌కు నష్టం చేకూర్చాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. అధికారులపై చేసినోళ్లు, భవిష్యత్ లో రాజకీయ నాయకులు, ప్రజలపై చేయరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. జిల్లాకు మెజిస్ట్రేట్‌గా ఉన్న క‌లెక్టర్‌‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగించే ప్రయ‌త్నం చేస్తున్నారన్నారు.

కుట్రపూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్రయ‌త్నం చేస్తున్నారన్నారు. గులాబీ గూండాల కుట్రల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాల‌ని రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనతో ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు బేడీలు వేశారన్నారు. ఇసుక దందాల‌కు అడ్డువ‌స్తున్నారని సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నేరెళ్లలో ద‌ళితుల‌ను ట్రాక్టర్‌తో తొక్కించి పోలీసు స్టేష‌న్‌లో థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని ఫైర్ అయ్యారు. మ‌ల్లన్న సాగ‌ర్ విష‌యంలో రైతుల‌కు పెట్టిన బాధ‌లు వర్ణణాతీతమని తెలిపారు. వేములవాడ‌లో రైతు ఆత్మర్పణం చేసుకున్నాడని మంత్రి పొంగులేటి అన్నారు.

Tags:    

Similar News