తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు?
రాష్టంలో డీఎస్సీ నిర్వహిస్తారని గంపెడు ఆశలతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు...
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో డీఎస్సీ నిర్వహిస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలు గత ప్రభుత్వంలో అడియాశలయ్యాయి . అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపి చివరికి 5089 పోస్టుల భర్తీకి మొగ్గుచూపింది . కనీసం ఆ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించాలనుకున్నా ప్రభుత్వ అలసత్వంతో వాటిని సహితంగా నిర్వహించలేకపోయింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు విసిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రభుత్వం అయినా కొత్త మెగా డీ. యస్సీ నిర్వహిస్తుందని అభ్యర్ధుల భారీ ఆశలు పెట్టుకున్నారు .
ఇప్పట్లో పరీక్షలు లేనట్టే?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం ఇస్తామని, 2024 ఏప్రిల్, డిసెంబర్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేశారు. 4 లక్షల మంది అభ్యర్థులు గత 6 సంవత్సరాలుగా టీచర్ పోస్టుల కొరకు ఎదురు చూస్తుంటే 2022 మార్చి 9న అసెంబ్లీలో అప్పటి సీయం కేసీఆర్ 13 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, చివరకు సాగదీస్తూ ఎన్నికల ముందు కేవలం 5089 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు.. పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. నవంబరు 20 నుండి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానీ అంతలోనే ఎన్నికల కోడ్ రావడం ఎన్నికలు నవంబరు 30న ఉండడంతో అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఇక ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా ఇంతవరకూ తేదీలు ఖరారు కాలేదు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై తిరిగి ఆశలు చిగురించాయి. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు మెగా డిఎస్సి వేయాలని 5089 పోస్టులకు చాలా మంది నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఇప్పుడు ఆధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 5089 పోస్టులకు వెలువడ్డ నోటిఫికేషన్ ఆపాలని, మిగతా 20 వేల టీచర్ పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 5089 పోస్టులకే పరీక్షలు పూర్తి చేస్తే ఈ నియమాక ప్రక్రియ పూర్తి చేయాలంటే కోర్టు కేసులు, వివిధ కారణాలతో జాప్యం వల్ల కనీసం ఒక సంవత్సరం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త నోటిఫికేషన్ జత చేయాలని డిమాండ్ చేస్తూన్నారు. ఎలాగూ 1.75 లక్షల మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించారని రీ నోటిఫికేషన్ జారీ చేస్తే అప్పుడు అప్లై చేయని అభ్యర్థులు కూడా అప్లై చేస్తారని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని వారి ఎన్నికల హామీ కూడా నెరవేర్చినట్టు ఉంటుందని అభ్యర్థులు, విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు
త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. త్వరలోనే శాఖల ఈ కేటాయింపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది . ఈ సందర్బంగా సీఎంతో చర్చించి మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం ఇస్తామని హామీ ఇచ్చినందన అప్పటి వరకు అధికారులు 5089 పోస్టులకు పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం లేదు. ఎలాగూ కొత్త ప్రభుత్వంతో చర్చించిన తర్వాత పరీక్ష తేదీలు ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలి
5089 టిచర్ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందున మిగిలిన పోస్టులు జత చేసి రీ నోటిఫికేషన్ జారీ చేయాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని, 4 లక్షల డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, అందుకే మెగా డీఎస్సీకి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.