ప్రైవేట్ యూనివర్సిటీల్లో నష్టపోయిన విద్యార్థులకు రిలీఫ్

రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలేని గురునానక్‌, శ్రీనిధి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది చేరిన దాదాపు 3 వేల మంది విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Update: 2023-07-02 15:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలేని గురునానక్‌, శ్రీనిధి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది చేరిన దాదాపు 3 వేల మంది విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో మూడు వేలమంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. గురునానక్‌, శ్రీనిధి వర్సిటీల్లోని విద్యార్థుల అంగీకారం మేరకు రాష్ట్రంలోని ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్‌.లింబాద్రితో చర్చించారు.

సూపర్‌ న్యూమరరీ కోటా కింద చేర్చేందుకు నిర్ణయం

గురునానక్‌లో 2,500 మంది, శ్రీనిధిలో 300 మంది వరకు ప్రవేశాలు పొందినట్లు విద్యాశాఖకు సమాచారం ఉంది. వారందరినీ ఇతర కళాశాలల్లో.. అవసరమైతే సూపర్‌ న్యూమరరీ కోటా కింద చేర్చాలని నిర్ణయించారు. దీనిపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రిని సంప్రదించగా.. ప్రభుత్వ సూచన మేరకు చర్చించామని, ఏ ఒక్క విద్యార్థీ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారని చెప్పారు. వీలైనంత త్వరలో విధివిధానాలు రూపొందించి విద్యార్థులకు రిలీఫ్ అందిస్తామని విద్యార్థులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించారు.

హైకోర్ట్ తీర్పుకు లోబడి ప్రభుత్వం నిర్ణయం

గతంలో ప్రభుత్వ అనుమతి, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లేకుండానే కొన్ని కళాశాలలు విద్యార్థులను చేర్చుకున్న ఘటనలు ఉన్నాయని, అలాంటి సందర్భాల్లో హైకోర్టు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక కళాశాలలో చేర్చి పరీక్షలు వ్రాయించాలని తీర్పును ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండు వర్సిటీల్లోని విద్యార్థులను ఇతర ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో చేర్చవచ్చని అధికారులు చెప్పినట్లు సమాచారం. బీటెక్‌, బీఫార్మసీ కోర్సులు నాలుగేళ్లు అయినందున ఆలోపు వారికి చదువు పూర్తయ్యేలా చేయవచ్చని చర్చించారు.

బిల్లును ఆమోదించని గవర్నర్

గత ఏడాది సెప్టెంబరులో 5 ప్రైవేట్‌ వర్సిటీల బిల్లులను అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌ తమిళిసైకి పంపినా వాటికి ఆమోదం లభించలేదు. ఇటీవల మరికొన్ని వివరాలు కావాలని గవర్నర్‌.. ప్రభుత్వాన్ని కోరారు. ఆ సమాచారాన్ని అందజేసినా గవర్నర్‌ బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో ఇక ఏదో ఒక పరిష్కారం చూపకపోతే విద్యార్థులు నష్టపోతారని భావించిన ప్రభుత్వం పరిష్కార మార్గాలను అన్వేషించాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సమాచారం.

Tags:    

Similar News