ఈ ఏడాది టార్గెట్ 4,16,500 ఇండ్ల నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి శ్రీకారం చుట్టడంతో ఈ ఏడాది రాష్ట్రం మొత్తం మీద 4,16,500 ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడు అదనంగా మరో 33,500 ఇండ్లను రిజర్వ్ కోటా కింద కట్టాలని ప్లాన్ చేస్తుంది.

Update: 2024-07-01 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి శ్రీకారం చుట్టడంతో ఈ ఏడాది రాష్ట్రం మొత్తం మీద 4,16,500 ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడు అదనంగా మరో 33,500 ఇండ్లను రిజర్వ్ కోటా కింద కట్టాలని ప్లాన్ చేస్తుంది. రానున్న ఐదేండ్ల కాలంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసంగా 3,500 చొప్పున మొత్తం 22.50 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందుకు రూ. 22,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభ ఎన్నికల షెడ్యూలుకు ముందే కొత్తగూడెం జిల్లాలో ఈ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల చివరి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖకు ఈ ఏడాది నిధుల కేటాయింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని పై ప్రతిపాదనలు చేశారు.

ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, అర్హులైన ప్రతీ కుటుంబానికి కట్టి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే తలదాచుకునేందుకు నీడ కోసం ఇండ్లను కట్టివ్వడం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎలక్షన్ కోడ్ కారణంగా స్కీమ్ అమలులో జాప్యం జరిగింధని ఇకపైన వేగం పెంచడానికి అవసరమైన కార్యాచరణ మొదలవుతుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం పేరుతో పేదల ఆశలు పుట్టించి చివరికి అందని ద్రాక్షగా మార్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయని, కానీ బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ ఇండ్లు మాత్రం కేటాయింపునకు నోచుకోకుండా మిగిలి పోయాయన్నారు.

ఇతర రాష్ట్రాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేయడానికి మన రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారుల బృందాలను అధ్యయనం కోసం పంపుతున్నట్లు మంత్రి పొంగులేటి ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో హౌజింగ్ డిపార్టుమెంటు ఆఫీసర్లు మూడు బృందాలుగా విడిపోయి చెన్నై, బెంగ‌ళూరు, ముంబాయి న‌గ‌రాల‌లో అక్కడి అధికారులతో చర్చిస్తారని తెలిపారు. ఇండ్ల నిర్మాణం, వాటికి రూపొందించిన నమూనాలు, ఎంత మందికి అందించాలని వాటి లక్ష్యం, ఒక్కో ఇంటి నిర్మాణానికి అయ్యే సగటు ఖర్చు, ల‌బ్ధిదారులు ఎంపిక‌కు అనుసరించిన విధానం, ల‌బ్ధిదారుల‌కు ఉండాల్సిన అర్హత త‌దిత‌ర విష‌యాల‌పై ఈ బృందాలు స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేస్తాయన్నారు. వీలైనంత తొందరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆ శాఖ అధికారులకు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క సూచించారు.

ప్రతీ ఇందిరమ్మ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్‌ను తప్పనిసరి చేసేలా నిబంధనను రూపొందించనున్నట్లు డిప్యూటీ సీఎం ఈ సమావేశంలో తెలిపారు. కాలుష్యానికి తావు ఇవ్వకుండా గ్రీన్ ఎన‌ర్జీని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున ఇందిర‌మ్మ ఇండ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు త‌ప్పనిస‌రి అని ప్రభుత్వం భావిస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇండ్ల నిర్మాణ స‌మ‌యంలో క‌చ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. గడిచిన పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణమైంది. ఎంతమంది లబ్ధిదారులకు అందాయి.. ఇంకా ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి.. లబ్ధిదారులకు ఇచ్చిన వెన్ని.. తదితర వివరాలతో పూర్తి స్థాయి సమాచారాన్ని అందించాలన్నారు. ఇండ్ల నిర్మాణం చేయ‌డానికి అనువైన ప్రాంతాల‌ను గుర్తించి, అక్‌పడ ఇండ్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన భూమి కోసం హౌజింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖ‌కు ప్రతిపాద‌న‌లు పంపాల‌ని డిప్యూటీ సీఎం సూచించారు.

Similar News