తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచి పరిణామం: ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సమావేశాన్ని నిర్వహించడం మంచి పరిణామమని, ఈ భేటీని స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Update: 2024-07-03 16:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సమావేశాన్ని నిర్వహించడం మంచి పరిణామమని, ఈ భేటీని స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మధ్య ఉన్న సమస్యల సత్వర పరిష్కారానికి ఈ సమావేశం నాంది కావాలని ఆకాంక్షించారు. భద్రాచలంలో ఐదు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇచ్చే విషయంలో సానుకూలతకు రావడం ద్వారా ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశం మంచి సంకేతాలు పంపాలని విజ్ఞప్తి చేశారు.

పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయిన, ఇంకా సమస్యలు కొనసాగడం బాధాకరమని, ఇందుకు కేంద్ర, గత రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం అని విమర్శించారు. చర్చల ద్వారా తప్ప వివాదాల ద్వారా సమస్యలకు త్వరిత పరిష్కారం లభించదని, కాబట్టి నిర్దిష్ట కాల పరిమితి లోగా పరిష్కారానికి వచ్చేలా ముఖ్యమంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయానికి రావాలని కూనంనేని సూచించారు.తిరుమలలో తెలంగాణ రాష్ట్రాల ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరారు. ఇక్కడికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తారు. తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సులు చెల్లకపోవడం దురదృష్టకరమన్నారు.

దైవదర్శనానికి వచ్చే తెలంగాణ ఎమ్మెల్యేల నుండి వచ్చే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకొని, దైవం దగ్గర బేధాభిప్రాయం లేకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉందన్నారు. టిటిడి భౌతికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా రెండు తెలుగు రాష్ట్రాల దేవాలయం. వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్రాల ఆరాధ్య దైవమన్నారు. ఉత్తరాదిలో అయోధ్య దేవాలయానికి ఎంత ప్రాతిష్టమున్నదో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంతా ప్రతిష్ట ఉందన్నారు.


Similar News