మహిళలకు రూ.2500.. కాలేజీ విద్యార్ధినులకు ఇస్తానన్న స్కూటీలేవి: బీజేపీ మహిళా మోర్చా

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని చెప్పారని, ఇంకెప్పుడు ఇస్తారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-07-03 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని చెప్పారని, ఇంకెప్పుడు ఇస్తారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మహిళలకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మార్వోకు ఆమె బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ మహిళా ద్రోహి ప్రభుత్వమని విమర్శలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డ కు రూ.1 లక్ష, తులం బంగారం, కాలేజీ కి వెళ్ళే విద్యార్థినులకు స్కూటీ, ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విలువైన విద్యార్థి హామీ కార్డు ఇస్తామన్నారని, ఇంకెప్పుడు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. మహిళలకు రూ.4 వేల పెన్షన్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నోటికి వచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ఇచ్చిందని, ఇప్పుడు అమలు చేయమంటే మాత్రం ఏమాత్రం పట్టించుకొనట్లుగా వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.


Similar News