రెవెన్యూ అధికారుల సపోర్ట్.. రూ.30 కోట్ల సర్కారు జాగా కబ్జా!
నగర నడిబొడ్డున ఉన్న రఘునాథ చెరువు (బొడ్డెమ్మ చెరువు) శిఖం భూమి కబ్జాకోరుల కన్నుపడింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగర నడిబొడ్డున ఉన్న రఘునాథ చెరువు (బొడ్డెమ్మ చెరువు) శిఖం భూమి కబ్జాకోరుల కన్నుపడింది. దశాబ్ధాలుగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నా వాటిని నిజామాబాద్ రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు అధికార యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తుల పట్టాభూమిగా చూపుతుండడంతో అక్కడ భూమిపై నజర్ వేయడంతో కోట్ల రూపాయల భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కానుంది.
డెవలప్‌మెంట్ కార్యక్రమాలు జరుగడం చూసి కాలనీ వాసులే నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డుగా బల్ధియా అధికారులు వినియోగించిన స్థలానికి రాత్రికి రాత్రి భూ యజమానులు పుట్టుకురావడం అందుకు కారణం. నిజామాబాద్ నగరంలోని గాజుల్‌పేట్, ఖిల్లా, సీతారాంనగర్ కాలనీ ప్రాంతాల ప్రజలకు శ్మశాన వాటికగా సుపరిచితమైన రఘునాథ చెరువు శిఖం భూమిలో ఇప్పుడు పట్టాదారులుగా యజమానుల పేరిట క్రయవిక్రయాలు జరిపి వాటిని కబ్జా చేసేందుకు ముందుకు రావడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాదారుల పప్పులు ఉడకలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదలు రికార్డుల తారు మారు మొదలుకుని కొత్తగా భూ యజమానులు రావడంతో శిఖం భూమి కాస్తా పట్టా భూమిగా మారి పోయింది. చారిత్రాత్మక నిజామాబాద్ ఖిల్లా (రఘునాథ ఆలయం) కింది భాగంలో ఒకనాటి కోటగోడ(అగడ్త) ఆనుకుని ఉన్న స్థలం నీటిపారుదల శాఖ శిఖం భూమిగా నిర్ధారించింది.
అయితే రఘునాథ చెరువు సాగునీరందించే పరిస్థితి నుంచి కేవలం తాగునీరందించే స్థితికి చేరడంతో దాని శిఖం కుచించుకుపోయింది. ప్రస్తుతానికి నిజామాబాద్ ఖిల్లా గోడనే హద్దుగా నిర్ణయించారు. దానిపై కన్నేసిన కబ్జాదారులు. రెండు దశాబ్ధాలుగా ఆ ప్రాంతంలో నిజామాబాద్ బల్దియా అధికారులు డంపింగ్ యార్డుగా ఉపయోగించారు. నాగారం శివారులో డంపింగ్ యార్డు కట్టే వరకు అక్కడ నిత్యం చెత్త కుప్పలే దర్శనమిచ్చేవి.
ఎప్పుడైతే బాబాన్ సాహెబ్ పహాడ్ నుంచి శాంతినగర్ వరకు తారురోడ్డు వేసి లింక్ ఇచ్చారో అప్పటి నుంచి ఆ భూములపై కబ్జాదారుల కన్నుపడింది. సర్వే నంబర్ 2545లో 15ఎకరాల శిఖం భూమిగా 1956 నుంచి 2015 వరకు రికార్డులో ఉంది. 1965 కంటే ముందుగా 55లో నాగారం సాయిలు అనే వ్యక్తి పేరు మీద ఈనామ్ భూమి ఉన్నట్లు రికార్డు తయారు చేశారు కొందరు ఘనులు. దానిని దఫదఫాలుగా పట్టా భూములు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2016 నుంచి కులాల వారీగా మతాల వారీగా విభజించి అందులో దానిని పట్టా భూములుగా రికార్డులకు ఎక్కించారు. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే అక్కడ ఇప్పుడు నిర్మాణాలు, కబ్జాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ అధికార యంత్రాంగం 2013లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల ఫెన్సింగ్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ కబ్జాదారులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రఘునాథ చెరువు శిఖం భూమిని మాత్రం ప్రభుత్వ భూమిగా చూపలేదు. దానికి తోడు అక్కడ రెండు సామాజిక వర్గాలకు చెందిన స్మశాన వాటిక ఉండడంతో అక్కడ నిర్మాణాలు జరుగుతాయా అనే సందేహంలో ఉండిపోయారు.
నగరంలో ప్రభుత్వ భూమి లభ్యత కరువు కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రఘునాథ చెరువు కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ చేస్తుండగా ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేసే ప్రణాళికలు ఉండడంతో కబ్జాదారుల కన్ను శిఖం భూమిపై పడింది. 2016 నుంచి ప్రభుత్వం చేపట్టిన రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో అదే అదునుగా రెవెన్యూ అధికారుల అండదండలతో అందులోనే అది ప్రైవేట్ భూమిగా ఈనామ్ భూమిగా చూపించేశారు.
అవే రికార్డులను పట్టుకుని రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పుడు అవి చేతులు మారడంతో అక్కడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఉన్న రియల్ భూం కారణంగా సంబంధిత భూమి రూ.30 కోట్లకు పైగా ఉంటుందని చెబుతుండగా అదంతా కబ్జా అవుతున్నా రెవెన్యూ అధికార యంత్రాంగం దానిని పట్టించుకునే పాపాన పోలేదు. రికార్డులు మారిన సమయంలో సంబంధిత అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదని చర్చ జరుగుతోంది.