Viral Video : సైక్లింగ్ కోసం షెడ్ వేస్తే.. ఇన్‌స్టా రీల్స్.. డ్యాన్స్‌లకు ఉపయోగం! సోషల్ మీడియాలో వైరల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో దేశంలోనే మొట్ట మొదటి సోలార్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో దేశంలోనే మొట్ట మొదటి సోలార్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఐటీ కారిడార్‌ని కలుపుతూ, ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న ఈ ట్రాక్.. మొత్తం 23 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ ట్రాక్‌ని పోయిన ఏడాది కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు రూ. 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్రాక్ సైక్లిస్ట్‌ల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఈ సైకిల్ ట్రాక్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఔటర్ వెంట ఉండటంతో సైకిల్ ట్రాక్ తరచుగా ప్రమాదాలకు గురయ్యేది. స్పీడ్‌గా వాహనాలు ట్రాక్‌పైకి దూసుకు రావడంతో సోలార్ రూఫ్‌టాప్ ధ్వంసం అవుతుండేది. దీంతో సైక్లింగ్ అంటేనే సైక్లిస్టులు జంకుతున్నారని గతంలో పుకార్లు వినిపించాయి. మరోవైపు సైకిల్ ట్రాక్‌పై బర్రెలు వాకింగ్ ట్రాక్‌గా వాడుకుంటున్నాయని గతంలో ఓ వీడియో వైరల్ అయింది.
అయితే, తాజాగా సైకిల్ ట్రాక్‌పై మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ట్రాక్‌పై సైక్లింగ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. ఇన్‌స్టా రీల్స్ కోసం వాడుకుంటున్నారని, ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సైక్లింగ్ కోసం షెడ్ వేస్తే.. డ్యాన్స్ వీడియోలు వేయడానికి ఉపయోగిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.