కాంగ్రెస్ సంక్షోభానికి కారణం ఆయనే.. దిగ్విజయ్‌తో తిరుగుబాటు నేతలు స్పష్టం!!

'మాణిక్కంతో వేగలేం.. ఆయన మా కొద్దు.. మార్చండి..' అంటూ ఏఐసీసీ దూత దిగ్విజయ్ సింగ్ ఎదుట సీనియర్లు నిరసన గళం వినిపించారు.

Update: 2022-12-23 02:23 GMT

'మాణిక్కంతో వేగలేం.. ఆయన మా కొద్దు.. మార్చండి..' అంటూ ఏఐసీసీ దూత దిగ్విజయ్ సింగ్ ఎదుట సీనియర్లు నిరసన గళం వినిపించారు. టీపీసీసీ చీఫ్‌కు అనుకూలంగా ఉంటున్నారని, ఠాగూర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్​రెడ్డి తన ఒక్కడి కోసమే ప్రోగ్రామ్స్ చేస్తున్నారని, ఏఐసీసీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకనే మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితులోనే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందంటూ గోదు వెళ్లబోసుకున్నారు. కొద్దిరోజులుగా టీ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరడంతో సమస్యలను సద్దుమణిగించాలని ఏఐసీసీ అధిష్టానం తాత్కాలిక ఇన్‌చార్జి‌గా దిగ్విజయ్ సింగ్‌ను పంపినది తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్​మాణిక్కం ఠాగూర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ దూత దిగ్విజయ్​సింగ్​ముందు వారంతా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఉదయం నుంచి రాత్రి దాకా సాగిన భేటీల్లో రేవంత్​వర్గం మినహా.. తిరుగుబాటు నినాదం ఎత్తుకున్న సీనియర్లు రాష్టంలో పార్టీ పరిస్థితులపై ఆందోళన గళం విప్పినట్టు తెలిసింది. రేవంత్​నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే.. ఆయనకు అన్నివిధాలుగా అండగా ఉంటున్న మాణిక్కంపైనా ఫిర్యాదులు చేశారు. ఠాగూర్ నియామకమైనప్పటి నుంచి ఇప్పటివరకు వరుస ఫెయిల్యూర్​ను ఫైల్​రూపంలో దిగ్విజయ్​కు అందించారు. పలువురు మాజీ ఎంపీలు కూడా ఆయన్ను మార్చాలంటూ గట్టిగానే వాదించారు. దీంతో ఠాగూర్​ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించేందుకు ఏఐసీసీకి నివేదిక ఇస్తామంటూ దిగ్విజయ్​.. రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలోనూ ఆయన పార్టీ నేతలందరినీ హెచ్చరించారు.

అన్ని విధాలుగా నష్టపోయాం..

మాణిక్కంతోనే కాంగ్రెస్​పార్టీకి అసలు సమస్యంటూ తిరుగుబాటు నేతల బృందం దిగ్విజయ్​వద్ద గోడు వెళ్లబోసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, జీవన్​రెడ్డి, వీహెచ్, రేణుకా చౌదరి, పొన్నం, శంకర్​రావు, బలరాం నాయక్, జానారెడ్డి, మహేశ్వర్​రెడ్డి, మధుయాష్కీతో పాటు పలువురు నేతలు దిగ్విజయ్​తో సమావేశమైన సందర్భంగా పార్టీలో మార్పులు, చేర్పులు అనివార్యమంటూ సూచించారు. వీరితో పాటు ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, సంపత్ కుమార్​ వంటి నేతలు కొంత తటస్థంగా సమాధానం చెప్పినట్టు సమాచారం. అయితే, వీరు కూడా రేవంత్​రెడ్డి నిర్ణయాలు, టీపీసీసీ కమిటీల ఎంపికను తప్పు పట్టారు. ఇక సీతక్క, రోహిన్​రెడ్డి వంటి నేతలు కూడా తమ అభిప్రాయాలను తాత్కాలిక ఇన్ చార్జ్ ఎదుట వినిపించారు. ప్రధానంగా ఠాగూర్​సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, కేవలం టీపీసీసీ చీఫ్​చెప్పినట్టే చేస్తున్నాడని మెజార్టీ నేతలు ఆరోపణలు చేశారు. పార్టీ అన్నివిధాలుగా నష్టపోయిందంటూ.. ఆయన్ను మార్చాలని కోరారు. తప్పుడు నిర్ణయాలతో వైఫల్యం చెందుతున్నారని, నేతల మధ్య సయోధ్య చేయడంలోనూ మాణిక్కం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయనకు వివరించారు.

తిరుగుబాటు తప్పలేదు

టీ పీసీసీ కమిటీల్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే నేతలకే అవకాశం ఇచ్చారని, సీనియర్ల ప్రతిపాదనలను కనీసం పరిగణలోకి తీసుకోలేదని తిరుగుబాటు నేతల బృందం ఆరోపించింది. ఏడాదిన్నర నుంచి పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని వాపోయారు. రేవంత్​సారథ్యంలో పార్టీకి మైలేజ్​రాలేదని, కేవలం ఆయన ఒక్కడి కోసమే కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ఏఐసీసీకి కూడా తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో నేతల మధ్య సఖ్యత లేకనే డిపాజిట్​రాలేదని దిగ్విజయ్ కు వివరించారు. పార్టీ చీఫ్​గా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, కనీసం సదరు నియోజకవర్గం, జిల్లా పార్టీ నేతలకు తెలియకుండానే అనూహ్యంగా ప్రకటిస్తున్నారని వెల్లడించారు. తమకు కనీస సమాచారం లేదంటూ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాలు, జిల్లాల్లో సీనియర్​ నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేసేందుకు రేవంత్​కంకణం కట్టుకున్నారని, పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నాడన్నారు. పార్టీని వీడిన వారంతా ఆయన కారణంగానే వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. పార్టీలోకి ఒక్కరిని కూడా తీసుకురాలేదని, తీసుకువచ్చిన వారంతా మళ్లీ వెళ్లిపోయారని పలు అంశాలను వివరించారు. పీసీసీ కమిటీలపై కూడా సీనియర్లకు ఏఐసీసీ నుంచి సమాచారం ఇవ్వలేదని, దీనిపై పార్టీ పెద్దలను అడిగినా రిప్లై రాలేదని, దీంతో తాము తిరుగుబాటు ప్రకటించాల్సి వచ్చిందని దిగ్విజయ్​ముందు నేతలు గోడు వెళ్లబోశారు.

అదుపు తప్పుతున్నారంటూ..

రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో వరుసగా భేటీ అయిన దిగ్విజయ్​సింగ్​.. పార్టీ నేతలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందుగా వారి నుంచి పార్టీ పరిస్థితి, కమిటీల నియామకం, అసంతృప్తుల వాదనలు విన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు..? అంతర్గత సమస్యలపై అభిప్రాయం ఏమిటీ, వాటికి పరిష్కారం కోసం సలహాలు ఏంటనే వాటిపై దిగ్విజయ్​ఆరా తీశారు. ఇదే సమయంలో ఓవైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలకు డిగ్గీ రాజా క్లాసులు తీసుకున్నారు. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయితీ ప్రస్తావనే ఉండొద్దని, ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది. కొంతమంది పార్టీ నిబంధనలను పాటించడం లేదని, బహిరంగంగా విమర్శలు చేయరాదని ఆదేశిస్తే కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక్కొక్కరిపైనా మండిపడ్డారు. తిరుగుబాటు నేతలతో పాటు రేవంత్​ వర్గీయులను సైతం మందలించారు. పార్టీ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని, ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందంటూ దిగ్విజయ్ ప్రశ్నించారు.

విషయాలన్నీ చెప్పాం : భట్టి

దిగ్విజయ్ తో భేటీ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ తాజా పరిస్థితులపై ఆయనకు వివరించినట్లు చెప్పారు. ఎవరు ఏంటనేది దిగ్విజయ్ సింగ్ కు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మరోసారి దిగ్విజయ్​సింగ్​కు తెలిపామన్నారు.

కోవర్టులు లేరు : జానారెడ్డి

టీ కాంగ్రెస్ లో కోవర్టులు లేరని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కోవర్టు అనేది అపోహ మాత్రమేనని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని, తాను కూడా కొన్ని సలహాలు ఇచ్చానన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారన్నారు. పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, రెండు మూడురోజుల్లో సమసిపోయి అందరం కలిసిపోతామని జానారెడ్డి పేర్కొన్నారు.

అలా అన్నందుకే బాధ పడ్డాం : సీతక్క

తమను వలసవాదులు అన్నందుకే ఆవేదనతోనే రాజీనామా చేశానని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. తమను వలసవాదులు అన్నవాళ్లు కూడా బయటి నుంచి వచ్చిన వాళ్లేనని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​కు అనుకూలంగా ఉందని, వివాదాలు పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. తాను రేవంత్ మనిషిని అయితే సీఎల్పీ నేత చెప్పిన పనులు చేయలేదా..? అని ఆమె ప్రశ్నించారు. తమ పనితీరుపైనే మాట్లాడాలని, పార్టీ ఏది చెబితే అది చేస్తానని స్పష్టంచేశారు. దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడిన అంశాలను మీడియాకు చెప్పలేనన్నారు.

పంచాయితీ కామన్​: రేణుకా చౌదరి

పార్టీలో పంచాయితీ కామన్​అని సీనియర్​ నేత రేణుకా చౌదరి పేర్కొన్నారు. అన్ని పార్టీల్లో ఉంటారని, ఒరిజినల్​అని ఎవరూ సర్టిఫికెట్​ఇవ్వాల్సిన పని లేదని, కలిసి పని చేయకుంటే కార్యకర్తలు తరిమికొడతారని వ్యక్తంచేశారు. కాంగ్రెస్​నేతల మధ్య పంచాయతీ లేదని, చిన్న సమస్యలేనని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​తెలిపారు. వలస, ఒరిజినల్​తప్పు మాటలని, అధిష్టానం ఏం చెప్తే అదే ఫైనల్​అని, పార్టీలో సీనియార్టీ కాదని, సిన్సియార్టీ ముఖ్యమని మాజీ మంత్రి శంకర్​ రావు చెప్పారు.

పార్టీలో డ్యామేజీ కంట్రోల్​చేయాలని చర్చించామని, అందరూ కలిసి పని చేసేలా చొరవ తీసుకోవాలని చెప్పామని మాజీ ఎంపీ వీహెచ్​అన్నారు. నేతలు ఎవరూ విడిపోలేదని, కలిసే ఉన్నామని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చెప్పారు. దిగ్విజయ్​కు రాష్ట్రంలో అన్ని విషయాలు తెలుసని, ఆయకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

కాగా, పార్లమెంట్​ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఎంపీ ఉత్తమ్​, రేవంత్ రెడ్డి ఈ భేటీకీ రాలేదు. అయితే, బుధవారం రాత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాత్రం దిగ్విజయ్​ను హోటల్​లోనే కలిశారు. తాను గాంధీభవన్​కు రానని, అందుకే ముందు కలిశానని చెప్పారు.

Also Read....

కేసీఆర్‌కు మరో షాక్.. తెలంగాణలో బాబు ఎంట్రీతో కొత్త గుబులు 

పార్టీ నేతలను చేతులు జోడించి కోరుతున్నా: Digvijay Singh 


Similar News