వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం
మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను ఆలయ ఈవో వినోద్ రెడ్డి(Evo Vinod Reddy) అప్పగించిన ఘటన కలకలం రేపుతోంది.
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ మెప్పుకోసం నిబంధనకు విరుద్ధంగా ఆలయానికి చెందిన కోడెలను ఈవో వినోద్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం కలకలం రేపుతోంది. వేములవాడ ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న వినోద్ రెడ్డి ఆగస్టు 12న 49 కోడెలను వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో తన అనుచరుడైన రాంబాబుకు కోడెలను అక్రమంగా విక్రయించినట్టు సమాచారం. భక్తులు దైవభక్తితో రాజన్నకు సమర్పించిన కోడలను పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడు రాంబాబుకు అక్రమంగా అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు.
దేవాలయ నిబంధనల ప్రకారం రైతులకు రెండు నుంచి మూడు కోడెలను మాత్రమే అప్పగించాలని, కానీ మంత్రి లెటర్‌ను అధికారులు విచారించకుండానే ఏకంగా 49 కోడెలను ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెల అక్రమ అప్పగింతలపై భక్తులు గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీరుపై విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి ఇన్ని కోడెల కేటాయింపు పై విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు.