ఆ ఓటర్ల కోసం టీఆర్ఎస్ వేట.. సీఎం ఆదేశంతో రంగంలోకి దర్యాప్తు బృందాలు!

అధికార పార్టీకి 'మునుగోడు' భయం పట్టుకున్నది. ఓడినా, గెలిచినా తమకేం నష్టం లేదని పైకి గాంభీర్యం చూపెడుతున్నా.. లోలోన మదనపడుతున్నది.

Update: 2022-09-24 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీకి 'మునుగోడు' భయం పట్టుకున్నది. ఓడినా, గెలిచినా తమకేం నష్టం లేదని పైకి గాంభీర్యం చూపెడుతున్నా.. లోలోన మదనపడుతున్నది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతున్నది. ఇప్పుడు వలస ఓటర్లపై దృష్టి పెట్టి, గాలం వేయడానికి ప్రణాళికలు వేస్తున్నది. వలస వెళ్లిన వారి సంఖ్య ఎంత? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? అని ఆరా తీస్తున్నది. వారిని తమ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి నిఘా బృందాలు శుక్రవారం సర్వే నిర్వహించినట్లు తెలిసింది.

సీఎం ఆదేశంతో..!

ప్రతి ఊరిలో ఎంత మంది వలసవెళ్లారు. ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారెంత మంది? ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారెవరు? సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ దర్యాప్తు బృందాలను ఆదేశించినట్లు తెలిసింది. మొన్నటి దాకా 24 అంశాలతోనే సర్వే లేదా దర్యాప్తు చేస్తున్న వారికి మరో ఆరు కొత్త అంశాలను ఇచ్చారు. ఇప్పుడు 30 పాయింట్లతో కూడిన వివరాలను గంటగంటకు మండలం, నియోజకవర్గం వారీగా సమాచారాన్ని చేరవేరుస్తున్నారు. ఏడు మండలాల్లో బృందాలు పర్యటిస్తున్నాయి. ప్రతి ఊరి సమాచారాన్ని వారి బాస్ లకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. కొందరు గ్రామాల్లోనే మకాం వేశారు. ఏ యే పార్టీ మీటింగ్ కి ఎంత మంది వచ్చారు? వారి అంచనా ఎంత? అన్న విషయాలను కూడా చెబుతున్నారు. ఆఖరికి సమావేశంలో ఎంత భోజనం సమకూరిస్తే ఎందరు తిని వెళ్లారన్న చిన్న అంశాన్ని కూడా వదలకుండా రిపోర్టులు రూపొందిస్తుండడం విశేషం. వారు ఎంపిక చేసుకున్న అంశాల్లోని పాయింట్లను పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక చావో రేవో అన్న రీతిలో కనిపిస్తున్నది.

ఎక్కడున్నారు?

గ్రామాల నుంచి పట్నాలకు వలసపోయిన వారి సంఖ్య ఎంత ఉంటుంది? వారి వలసలకు గల కారణాలేమిటి? ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారు? వారిని ఓట్ల పండుగకు ఆహ్వానించాలంటే ఎవరిని పట్టుకోవాలన్న విషయాలన్నీ కూడా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. స్థానిక నాయకులు చేయదగిన పనులను కూడా నిఘా బృందాలకు అప్పగించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. స్థానిక నాయకులపై గులాబీ బాస్ కి నమ్మకం నమ్మకం పోయిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా గెలుపు లక్ష్యాలను శోధిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండకు వలసవెళ్లిన వారున్నారు. అయితే వారి గురించి ఆరా తీసి ఏమైనా తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ముందుగానే గులాబీ గూటికి చేర్చాలన్న ప్లాన్ లో ఉన్నారు. హైదరాబాద్ లో సెటిలైన వారితో వారం రోజుల క్రితమే అంబర్ పేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సభ నిర్వహించారు. అక్కడికి కూడా వేలాది మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన టీఆర్ఎస్ బాస్ తాము వెనుకబడ్డామన్న అసహనంతో ఉన్నారు. బీజేపీ కంటే ముందే చేయాల్సిన పనిని మంత్రి జగదీష్ రెడ్డి, అభ్యర్థిగా చెప్పుకుంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు నిర్వహించలేకపోయారన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ బృందాల ద్వారా పెద్ద అంబర్ పేట బీజేపీ రహస్య సమావేశం సీఎం దాకా చేరడంతోనే స్థానిక నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లినట్లు అంచనా. ఈ క్రమంలోనే నిఘా బృందాలకు బాధ్యత అప్పగించినట్లు తెలిసింది.

ఎవరి బలమెంత?

నియోజకవర్గంలో వార్డు సభ్యుడి స్థాయి వ్యక్తిని కూడా వదలుకోవద్దని టీఆర్ఎస్ భావిస్తున్నది. అందుకే కాంగ్రెస్, బీజేపీల్లో చురుకుగా పని చేస్తున్న నాయకులు, కార్యకర్తల బలాబలాలు, బలహీనతల గురించి ఆరా తీస్తున్నారు. ఎవరిని లాక్కుంటే ఎంత లాభం వస్తుందన్న విషయంపై ఫోకస్ పెట్టారు. గ్రామాల వారీగా డేటాను సిద్ధం చేసే పనిలో నిఘా వర్గాలు పని చేస్తున్నాయి. శుక్రవారం నుంచి ప్రతి పల్లెను అదే అంశంలో గాలిస్తున్నట్లు తెలిసింది. శనివారం కల్లా ఎవరెవరి బలం ఎంత ఉండొచ్చునన్న రిపోర్టు సీఎం కేసీఆర్ కు చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

చేతులు కాలాక..

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి? ఎక్కడ అవినీతి జరిగింది? దానికి కారణాలు ఏమిటి? ఈ అంశాలు కూడా నిఘా బృందం రిపోర్టులో ఉన్నాయి. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలతో పోలిస్తే మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి పల్లె వెనుకబడి ఉన్నది. మునుగోడు అభివృద్ధిపై టీఆర్ఎస్ కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాజగోపాల్ ఇప్పటికే ఆరోపించారు. ఇప్పుడా విషయం ఎంత వరకు నిజమని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆరా తీస్తుండడం గమనార్హం. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రణాళికను రూపొందించేందుకు జిల్లా మంత్రి, లోకల్ లీడర్స్ అభిప్రాయం కంటే నిఘా బృందాల రిపోర్టులపైనే ఆధారపడుతుండడం విశేషం. అన్ని పార్టీల ప్రతి చిన్న సమావేశంపైనా కన్నేసి ఉంచడం పట్ల మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఎంత అవసరమన్నది సూచిస్తున్నది.

Also Read : గిరిజన బంధుకు బ్రేక్.. ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా?

Tags:    

Similar News