గ్రేటర్లో ‘రియల్’ జోరు.. ఏడు నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది. భవనాలు, లే అవుట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య, వాటి ద్వారా వచ్చే ఆదాయం రెండూ పెరిగాయి. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా పెరిగిందని అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం.
ఎన్నికల కోడ్‌తో దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ.. గతేడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకోవడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు రియల్ ఎస్టేట్ రంగంలో ఊపును తీసుకొచ్చాయి. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై సర్కారు దృష్టి సారించింది. భూ సేకరణ పనులను కూడా ఆరంభించింది. దాంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడింది.
పెరిగిన ఆదాయం
గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,670.52 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిసింది. అంతకు ముందు ఏడు నెలల్లో అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం రూ.4,429.23 కోట్లు. అంటే రూ.241.29 కోట్ల ఆదాయం పెరగడం గమనార్హం. రోజురోజుకూ విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఇది సంకేతమని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఇదే వ్యవధితో పోల్చినా రూ.270.86 కోట్లు ఎక్కువగా ఉండట విశేషం.
గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. గతేడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 12.5 % పెరిగాయి. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. గతేడాది ఇదే వ్యవధిలో 50,535 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పటితో పోలిస్తే 7 % పెరుగుదల నమోదైంది. డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18,077. గతేడాది మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇచ్చి భవన అనుమతుల సంఖ్య 17,911. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7,809. అంతకు ముందు ఏడు నెలలతో పోలిస్తే 13.17 % పెరిగింది.
రియల్ ఎస్టేట్‌కు భరోసా
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటతో ఏదో జరుగుతుందన్న ప్రచారానికి తెరపడింది. గతం కంటే ఇప్పుడే వ్యాపారం జోరందుకోవడం విశేషం. అధికారిక లెక్కల ప్రకారమే 12.5 % అమ్మకాలు పెరిగాయి. అలాగే కమర్షియల్ స్పేస్ వినియోగంలోనూ ఈ ఆర్నెళ్లల్లోనే 13 % పెరిగినట్టు స్థిరాస్తి వ్యాపార సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్ల మధ్య సిటీ విస్తరించనున్నది. అనేక ప్రాజెక్టులకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే వాటి మధ్య రేడియల్ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే అవి కార్యరూపం దాల్చనున్నాయి. ఇక్కడే పెట్టుబడులకు అవకాశం ఎక్కువగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలు నిర్మాణ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడి వాతావరణం, ప్రభుత్వ ప్రాజెక్టులే పెట్టుబడులకు దారి తీస్తాయన్నారు.