త్వరలో ఇందిరా మ‌హిళా శ‌క్తి వారోత్సవాలు: మంత్రి సీత‌క్క

త్వరలో ఇందిరా మ‌హిళా శ‌క్తి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీత‌క్క తెలిపారు...

Update: 2024-11-02 16:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వరులను చేసే ల‌క్ష్యంతో త‌మ ప్రభుత్వం ప‌ని చేస్తుందని మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. ప్రతి మ‌హిళ స్వయం స‌హాయ‌క సంఘాల్లో చేర్చేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి సంబంధించి వారోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాలు ఇప్పించేలా గ్రామ, గ్రామాన‌ బ్యాంక‌ర్లతో స‌ద‌స్సులు నిర్వహించాలని సూచించారు. సచివాలయంలో శ‌నివారం డీఆర్డీఓల‌తో మంత్రి సీత‌క్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా వ‌చ్చే ఐదునెల‌ల్లో చేప‌ట్టాల్సిన పనులపై మంత్రి రిపోర్టు కోరారు. మార్చిలోపు ఉపాధి హామీ పనుల కోసం రూ.1372 కోట్ల నిధులు ఖ‌ర్చు చేస్తామని మంత్రి సీతక్క భరోసా కల్పించారు.

మ‌హిళ‌ల‌కు ఉపాధి భ‌రోసా, పంట‌ పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ ప‌నుల కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క తెలిపారు. అయితే క్షేత్ర స్థాయిలో ప్రజల అవ‌స‌రాలు, అభివృద్ది ప్రాతిప‌దిక‌న పనులను గుర్తించాల‌న్నారు. గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచి గ్రామ సభలు విధిగా నిర్వహించాల‌ని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధి పనులను చేపట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్‌లు లేక ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రతి ఇంటిలో టాయిలెట్ వుండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీత‌క్క ఆదేశించారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమ‌న్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించే ల‌క్ష్యంతో ప‌ని చేయాల‌ని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ రాజ‌న్, క‌మీష‌న‌ర్ అనితా రామ‌చంద్రన్, స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ బీ షపీయుల్లా తదితరులు పాల్గొన్నారు.


Similar News