కుల గణన డ్యూటీ ఉపాధ్యాయులందరికీ వేయాలి: Teachers Unions

కుల గణన విధులు ఉపాధ్యాయులందరికీ వేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..

Update: 2024-11-02 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కుల గణన విధులు ఉపాధ్యాయులందరికీ వేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. కాగా ఈ విధులను కేవలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకే కేటాయించడాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్), సెకండరీ గ్రేడ్ ఉపాధ్యా య సంఘం తెలంగాణ(ఎస్జీటీయూ) నాయకులు ఖండించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు స్కూళ్ల నిర్వహణ, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం సర్వే నిర్వహించినట్లయితే గ్రామాల్లో ప్రజలు అందుబాటులో ఉండరనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. అలా కాకుండా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ఉపయోగించుకొని పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించి కేవలం ఉదయం పూట సర్వేను నిర్వహించినట్లయితే తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చని వారు పేర్కొన్నారు. కేవలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు విధులను కేటాయించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అందరికీ సమానంగా ఈ సర్వే విధులను కేటాయించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా కుల గణన విధుల కోసం అన్ని యాజమాన్యాల సర్ ప్లస్ టీచర్ల సేవలను వినియోగించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా వెంటనే మరో రెండు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2024 వేకెన్సీలను ప్రదర్శించడంలో జరిగిన పొరపాట్లను వెంటనే సవరించాలన్నారు. గతంలో బదిలీ అయినా రిలీవ్ కానీ, ఇంకా డిప్యూటేషన్ లో కొనసాగుతున్న వారిని రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోఉతే కులగణన చేపట్టేందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నా కేవలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకే ఆ విధులను కేటాయించడాన్ని ఖండించారు.


Similar News