రేపు నిరాహారదీక్ష చేస్తా: సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్

రాష్ట్రంలో అటవీశాఖ మాఫియాను రన్ చేస్తోందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఘాటు విమర్శలు చేశారు..

Update: 2024-11-02 16:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అటవీశాఖ మాఫియాను రన్ చేస్తోందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవి పందులను చంపుతున్నారని తమ నియోజకవర్గానికి చెందిన రైతులపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపణలు చేశారు. అక్రమ సంపాదన కోసం అటవీ అధికారులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలపై మంత్రి కొండా సురేఖను కలిసి వినతి పత్రం అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఎక్కడైనా అడవి పంది, దుప్పి చనిపోతే అధికారులకు పండుగేనంటూ ఎద్దేవాచేవారు. అటవీశాఖ అధికారులు కొన్ని ఊర్లను ఎంచుకొని లక్షల్లో డబ్బు లాగుతున్నారని హరీశ్ బాబు ఆరోపించారు. అడ్డగోలు, అక్రమ సంపాదనకు మరిగి ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు. దీనిపై డీఎఫ్‌వో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు సోమవారంలోపు చర్యలు తీసుకోకుంటే సిర్పూర్ రేంజ్ ఆఫీస్ ఎదుట నిరాహారదీక్షకు దిగుతానని పాల్వాయి హరీశ్ బాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అటవీ అధికారుల తీరు చూసి పోలీసులు సైతం థర్డ్ డిగ్రీ మొదలెట్టారని, బ్రిటీష్ కాలం లో థర్డ్ డిగ్రీ ఉపయోగించేవారని, మళ్లీ ఈ ప్రభుత్వంలో చేస్తున్నారని హరీశ్ బాబు విమర్శలు చేశారు.


Similar News