సెక్రెటేరియట్ ఆర్కిటెక్టులకు చార్జీలు చెల్లించని గత ప్రభుత్వం

సెక్రెటేరియట్ నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. భవన డిజైన్ ను రూపొందించిన ఆర్కిటెక్టులకు సంబంధించి చార్జీలను మాత్రం పెండింగ్ లో పెట్టింది.

Update: 2024-09-27 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రెటేరియట్ నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. భవన డిజైన్ ను రూపొందించిన ఆర్కిటెక్టులకు సంబంధించి చార్జీలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. అయితే సచివాలయ నిర్మాణం, వెచ్చించిన నిధులు, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సర్కారు కూడా ఆ చార్జీలను చెల్లించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు చర్చ జరుగుతున్నది. 2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే డిజైన్ రూపొందించే బాధ్యతలను ఆస్కార్- పొన్ని కాన్సెసావో దంపతులకు అప్పగించింది. ప్రారంభంలో నిర్మాణానికి రూ. 617 కోట్లు ఖర్చవుతాయని భావించగా.. 2023లో నిర్మాణం పూర్తయ్యే సమయానికి వ్యయం రూ. 1,140 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్టులైన ఆస్కార్-పొన్ని దంపతులకు పూర్తి స్థాయిలో చార్జీలు చెల్లించనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ చార్జీలు చెల్లించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఆస్కార్-పొన్ని కాన్సెసావో దంపతులు ఇటీవల వినతిపత్రం అందజేశారు. అయితే ప్రస్తుతం వివిధ అంశాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్అండ్ బీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఆస్కార్-పొన్ని దంపతులను సంప్రదించగా.. స్పందించేందుకు వారు నిరాకరించారు.


Similar News