వనపర్తిలో ఒక్కటైన టాలీవుడ్ ప్రేమ జంట... హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకుంది ఇక్కడే..!
మరో టాలీవుడ్ సినీ ప్రేమ జంట ఒకటయ్యారు.
దిశ, వనపర్తి ప్రతినిధి : మరో టాలీవుడ్ సినీ ప్రేమ జంట ఒకటయ్యారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారు పెళ్లి చేసుకొని ఏడడుగులు వేశారని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పురోహితులు వీరి పెళ్లి తంతును సంప్రదాయబద్దంగా జరిపించారు. కాగా వివాహం తంతు పూర్తయ్యే వరకు ఆలయంలోకి మీడియాను, స్థానికులను, ఇతరులు ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా ఆలయ కమిటీ సభ్యుల సెల్ ఫోన్లను సైతం లోపలికి అనుమతించలేదని సమాచారం. కాగా వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వర రావు మనుమరాలే అదితి రావు హైదరీ కావడం విశేషం. అలాగే శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన రంగనాథ స్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అదితిల వివాహం జరగడం మరో విశేషం.
అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే వీరి పెళ్లి ఫొటోస్ కూడా ఇంకా బయటకు రాలేదు. సిద్ధార్థ్, అదితి కలిసి మహా సముద్రం చిత్రంలో నటించారు. ఈ చిత్రీకరణలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. వీరిద్దరికీ రెండో వివాహం అని తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అలాగే అదితికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అతడితో 2012లో విడాకులు తీసుకుంది. తెలుగులో వి, సమ్మోహనం, అంతరిక్షం వంటి చిత్రాల్లో అదితి నటించింది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కింస్తున్న హీరామండిలో నటిస్తుంది.