పద్మశ్రీ మొగులయ్యకు కోటి రూపాయలిచ్చాం.. ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నాం

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం లేదనే వార్త వివాదాస్పదమైంది. అధికారుల స్థాయిలో చర్చకు దారితీసింది.

Update: 2024-05-03 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం లేదనే వార్త వివాదాస్పదమైంది. అధికారుల స్థాయిలో చర్చకు దారితీసింది. రెండేండ్లుగా ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో దినసరి కూలీగా పనిచేస్తున్నారంటూ ఆయన మాటలనే ఉటంకిస్తూ ఆంగ్ల దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఆ కథనంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, మొగులయ్య చెప్పినట్లుగా పేర్కొన్న అంశాలు వాస్తవ విరుద్ధమైనవని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వివరణ ఇస్తూనే ప్రభుత్వం నుంచి ఏయే రూపాల్లో ఎలాంటి సహకారం అందిందో వివరాలను ఆయన ఒక ప్రకటన రూపంలో వెల్లడించారు. రెండేండ్ల క్రితమే ఆయనకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు మంజూరయ్యాయని, ప్రతి నెలా వృద్ధ కళాకారులకు ఇచ్చే పింఛన్ కూడా అందుతూ ఉన్నదని స్పష్టత ఇచ్చారు.

ప్రతీ సందర్భంలో పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ప్రభుత్వం సహకారం అందిస్తూనే ఉన్నదని వివరించారు. నగదు ప్రోత్సాహక బహుమతిగా గత ప్రభుత్వంలోనే 2022 జూన్ 1వ తేదీన ఆయనకు కోటి రూపాయల (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చెక్కు ప్రభుత్వం నుంచి వెళ్ళిందని, అది ఆయన ఖాతాలో అదే నెల 10న డిపాజిట్ అయిందని పేర్కొన్నారు. అరుదైన కళాకారుడిగా, అంతరించిపోతున్న కళను భవిష్యత్తు తరాలకు అందించడానికి చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందునే పద్మశ్రీ అవార్డుకు ఆయన పేరును గత ప్రభుత్వం సిఫారసు చేసిందని డాక్టర్ హరికృష్ణ గుర్తుచేశారు. అవార్డు వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక బహుమతిని కోటి రూపాయలను ప్రకటించడంతో పాటు ప్రతి నెలా కళాకారుల పెన్షన్‌ను కూడా ఇవ్వనున్నట్లు అప్పట్లోనే ప్రకటించామని పేర్కొన్నారు.

పెన్షన్ ఇస్తామన్న హామీ ప్రకారమే 2021 మే 29న ప్రభుత్వం ఒక జీవో (నెం. 122) జారీ చేసిందని, ప్రతి నెలా రూ. 10 వేల చొప్పున ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేసేలా నిర్ణయం తీసుకున్నదని డాక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన మూడు రోజుల నుంచే కార్యాచరణ మొదలైందని, జూన్ 2021 నుంచి ప్రతి నెలా ఆయనకు రూ. 10 వేల చొప్పున పింఛన్‌ను ప్రభుత్వం అందిస్తూ ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా సహకారం అందుతూ ఉన్నా రెండేండ్లుగా అన్యాయమే జరుగుతున్నదని ఆయన చెప్పడం వాస్తవానికి విరుద్ధమని ఆ ప్రకటనలో డాక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. మార్చి 31వ తేదీన కూడా రూ. 10 వేల పింఛన్‌ను మొగులయ్యతో పాటు మరో కళాకారుడు గుస్సాడి కనకరాజుకు కూడా జమ అయినట్లు ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.

Tags:    

Similar News