TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపిన మార్షల్స్
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఈ రోజు తెల్లవారుజామున స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇంతలో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్చించాలని నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిండు సభలో మహిళా సభ్యులను అవమానించారని.. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ మాత్రం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తాననడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
అనంతరం హరీశ్ మాట్లాడి.. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అక్కడే కూర్చుని సీఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్న మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ముందు కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ గేటు ముందు కూర్చుని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.