ఇద్దరు దారుణ హత్య.. తామే చంపినట్లు ప్రకటించిన మావోయిస్టులు
ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులను అర్ధరాత్రి మావోయిస్టులు నరికి చంపారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో చోటు చేసుకుంది.
దిశ, ఏటూరునాగారం/భద్రాచలం: ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులను అర్ధరాత్రి మావోయిస్టులు నరికి చంపారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాజేడు మండలం పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఊయిక రమేష్, అతని తమ్ముడు ఊయిక అర్జున్‌లు పోలీస్ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తూ మావోయిస్టుల దళ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే నేపంతో గురువారం రాత్రి సమయంలో నిద్రిస్తుండగా మావోయిస్టులు గోడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన రమేష్‌ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. కాగా.. గతంలో రమేష్, అర్జున్‌లకు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చిరించినట్లుగా సమాచారం. కాగా ఈ విషయం పై మావోయిస్టులు వాజేడు, వెంకటాపురం ఏరియా మావోయిస్టుల కార్యదర్శి శాంత పేరుతో లేక విడుదల చేశారు.
లేఖలో ఏముందంటే..
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఊయికే అర్జున్ గ్రామంలో ఉన్నప్పటి నుండే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారాడు. ఇతను వాజేడు మండలంలో ఉంటున్నాడు. ఇతను చేసిన పని అంతా చేపల వేట, గొండ్ల పేరుతో రకరకల పేర్లతో అడవిలోకి వచ్చి దళం మకాంలు, కదలికలు చూసి ఫోన్ చేస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు. ఇతని పద్దతులు మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినడం లేదు అందుకే ఇతన్ని ఖతం చేస్తున్నామని ఒక లేఖలో పేర్కొన్నారు.
మరో లేఖలో ఏముందంటే?
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఊయికే రమేష్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి పని చేస్తున్నాడు. అప్పటి నుండి గ్రామంలో ఉంటూ పార్టీ కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు పసి గడుతూ విషయాలు చేరవేస్తూ మండల సెంటర్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు. క్రమంగా ఏఎస్‌బీ కంట్రోల్‌లోకి వెళ్లి పని చేస్తూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బార్డర్‌లో ఉన్న గ్రామాలు లంక పల్లి, జన్నప్ప, ఉట్ల, శానుల దోడ్డి, వాయు పేట గ్రామాలతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరిస్తూ పోలీసులకు చేప్పే వాడు కొన్ని దాడులకు కారకుడు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నాడు. షికారు పేరుతో చేపల వేట గొండ్ల పేరుతో అడవిలోకి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చెబుతున్నాడు. పద్దతులు మార్చుకోవాలని చెప్పినప్పటికీ వినడం లేదు. అందుకే రమేష్‌ను కూడా ఖతం చేస్తున్నామని మరో లేఖలో పేర్కొన్నారు.