పట్నం ఆస్పత్రుల్లో పేషెంట్ల లోడ్.. ఆ నాలుగు ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణం!

హైదరాబాద్ పరిధిలోని ఆస్పత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరగడంతో ఓపీ(అవుట్ పేషెంట్ విభాగం) డబుల్ అయింది.

Update: 2024-08-10 02:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పరిధిలోని ఆస్పత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరగడంతో ఓపీ(అవుట్ పేషెంట్ విభాగం) డబుల్ అయింది. ఇన్‌పేషెంట్లలోనూ 20 %పెరిగారని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు చెప్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రద్దీ ఎక్కువైంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి సీజనల్ లక్షణాలతో పేషెంట్లు హాస్పిటల్స్‌కు వస్తున్నారు. చాలా మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులను ఆశ్రయించినా..వారం నుంచి పది రోజుల వరకు ఈ సీజనల్ సింప్టమ్స్ తగ్గకపోవడంతో బాధితులు టీచింగ్ దవాఖానలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో అడ్మిషన్లు పెరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేలకు పైగా డెంగ్యూ కేసులు తేలగా, వీరిలో 80 % పేషెంట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. ఇందులో 50 % మంది వివిధ హాస్పిటల్స్‌లో అడ్మిటై ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లేట్‌లెట్స్ పడిపోవడం, నీరసం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు డెంగ్యూ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పారు. అనధికారికంగా డెంగ్యూ కేసులు రెట్టింపు స్థాయిలోనే ఉన్నాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

నర్సుల కొరతతో సేవల్లో డల్

గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రంతో కలుపుకొని దాదాపు 1,300 బెడ్లు ఉన్నాయి. ప్రతి రోజూ ఓపీకి మూడు వేల మందికి పైనే వస్తున్నారు. వీరిలో సుమారు 25 % చొప్పున ఇన్‌పేషెంట్‌లో అడ్మిట్ అవుతున్నట్టు సమాచారం. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వివిధ విభాగాల్లో 362 మంది డాక్టర్లు, 119 సీనియర్ రెసిడెంట్లు, 723 పీజీలు, 287 మంది నర్సింగ్ ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు. మిగతా కేడర్‌తో పోల్చుకుంటే నర్సింగ్ స్టాఫ్ ​చాలా తక్కువగా ఉన్నారు. పైగా ఇటీవల జనరల్ ట్రాన్స్‌ఫర్లలో దాదాపు 70 మంది నర్సింగ్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఆయా స్థానాల్లో ఇంకా కొన్ని ఖాళీగానే ఉన్నట్టు తెలిసింది.

వంద మంది పేషెంట్స్ ముగ్గురు నర్సింగ్ ఆఫీసర్లు

ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ ప్రకారం ప్రతి జనరల్ వార్డులో ఆరుగురు పేషెంట్లకు ఓ నర్సింగ్ ఆఫీసర్ ఉండాలి. ఐసీయూలో 1: 1, ఎన్‌ఎస్‌సీయూలో 1:3 రేషియో‌లో ఉండాలి. 8 గంటలకు ఓ షిప్టు చొప్పున ప్రతి రోజూ 3 షిప్టుల్లోనూ నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి. ఈ లెక్కన గాంధీలో ప్రస్తుతం ఉన్న బెడ్ల సంఖ్యకు అనుగుణంగా దాదాపు మరో 300 నర్సింగ్ ఆఫీసర్లు అవసరం ఉన్నదని స్వయంగా ఆఫీసర్లే వివరిస్తున్నారు. ప్రస్తుతం వంద మంది ఉన్న ఒక వార్డులో కేవలం ముగ్గురు నర్సింగ్ ఆఫీసర్లతో నెట్టుకువస్తున్నామని ఓ ప్రోఫెసర్ వెల్లడించారు. పైగా వీళ్లంతా 2021, 2024లో నియామకాల్లో చేరిన వాళ్లేనని, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు కొరత ఉన్నదని వివరించారు. నిలోఫర్‌లో దాదాపు 1,250 కు పైగా బెడ్లు ఉన్నాయి. శాంక్షన్ పోస్టుల ప్రకారం ఇప్పటికే 92 ఖాళీలుండగా, జనరల్ ట్రాన్స్​‌ఫర్లలో 23 మంది ఇతర ప్లేస్‌లకు వెళ్లారు. ఉస్మానియాలో దాదాపు 1,200 బెడ్లు ఉండగా, 266 మంది డాక్టర్లు, 218 మంది సీనియర్ రెసిడెంట్లు, 1,638 పీజీలు, 263 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఇటీవల జనరల్ ట్రాన్స్‌ఫర్లలో 115 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లగా, కేవలం 25 % స్థానాలు మాత్రమే భర్తీ అయ్యారు. ఈ లెక్కన బెడ్ల సంఖ్య ప్రకారం ఉస్మానియాకూ దాదాపు మరో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లు అవసరం. ఫీవర్ హాస్పిటల్ కూడా ఇదే తరహాలో ఉన్నది. ప్రతి రోజూ దాదాపు 800లకు పైనే ఓపీ కంటిన్యూ అవుతుంది. డెంగ్యూ, డయేరియా, వైరల్ ఫీవర్ల వార్డులన్నీ పుల్ అయ్యాయని ఓ డాక్టర్ తెలిపారు.

సిటీలో పది మందిలో ఒకరికి వైరల్..?

డైలీ ఓపికి వచ్చే ప్రతి పది మందిలో ఒకరికి వైరల్ ఫీవర్ కన్ఫామ్ అవుతుందని, మిగతా వాళ్లకు సాధారణ లక్షణాలే ఉంటున్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు. మరో రెండు నెలల వరకు డెంగ్యూ, వైరల్ ఫీవర్ కేసులు భారీగా నమోదయ్యే ప్రమాదం ఉన్నదన్నారు. ఇక ఏజెన్సీ ఏరియాల్లో ప్రతి ఇంట్లో వైరల్ ఫీవర్స్ బాధితులు తేలుతున్నారు. దీంతో దోమల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల ఆయిల్ బాల్స్ సిద్ధం చేశారు. దాదాపు 11,325 గ్రామపంచాయతీల్లో యాంటీ లార్వల్ మందు పిచికారి చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతేగాక 12,682 గ్రామాల్లో జ్వర సర్వేలు నిర్వహించి ముందుగానే ప్రివెంటివ్ మెడిసిన్స్ కిట్లు పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ అన్ని జిల్లాలకు ఉత్తర్వులిచ్చింది. 8 వేల మంది ఏఎన్‌ఎంలు, 37 వేల మంది ఆశాలు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News