వెంచర్‌గా కోర్టు వివాదంలో ఉన్న భూమి.. ‘రియల్’ చీటర్‌పై చర్యలేవి..!
వైరాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బరితెగించారు.
దిశ, వైరా : వైరాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బరితెగించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డిటిసిపి అనుమతి లేకుండానే వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పటికే సుమారు రూ.కోటిన్నరలకు 25 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న కోర్టు వివాదం మూడు నెలల క్రితం ‘దిశ’ కథనాలతో బహిర్గతం కావడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ మోసం బహిర్గతమైంది. దీంతో ఆ వెంచర్లో 25 ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.
కోర్టు వివాదంలో ఉన్న భూమిని తమకు విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని ఒక్కో కొనుగోలుదారుడు తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్లను విక్రయించే వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైరాలోని రియల్ వ్యాపారి ప్లాట్ల కొనుగోలుదారులను ఇలా బురిడి కొట్టించాడు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని డిటిసిపి అనుమతి లేకుండా వెంచర్ వేసిన విషయం బహిర్గతమై మూడు నెలలు గడుస్తున్నా ఆ వ్యాపారిపై నేటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ వ్యవహారంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నెలల క్రితం ఈ వెంచర్లో మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ప్లాట్లు సరిహద్దు తెలిపే రాళ్ళను తిరిగి ఏర్పాటు చేయడం విశేషం.
కోర్టు వివాద భూమి వివరాలు ఇవే...
కొణిజర్ల మండలంలోని దిద్దుపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 49లో గోరంట్ల నాగేశ్వరావు అనే వ్యక్తి పేరుపై మూడు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై నాగేశ్వరావు బంధువులు కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు ఈ పొలంపై స్టే ఆర్డర్ విధించింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని వైరాకు చెందిన ఓ రియల్ వ్యాపారి 2021వ సంవత్సరంలో కొనుగోలు చేసి డిటిసిపి అనుమతి లేకుండా వెంచర్ వేశాడు. ఈ వెంచర్లో సుమారు 25 ప్లాట్లను మధ్యతరగతి ప్రజలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కోర్టు వివాదంలో ఈ భూమి ఉన్న విషయం బహిర్గతం కావడంతో ప్లాట్లు కొన్న వాళ్లు తిరిగి అమ్మేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఆ ఫ్లాట్లు కొన్న మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
రియల్ వ్యాపారిపై చర్యలేవీ?
కోర్టు వివాదంలో ఉన్న భూమిని డిటిసిపి అనుమతి లేకుండా వెంచర్ వేసి మధ్యతరగతి ప్రజలను మోసం చేసిన సదరు రియల్ వ్యాపారిపై నేటి వరకు కనీస చర్యలు తీసుకోలేదు. సుమారు 25 మందికి కోర్టు వివాద భూమిని కోటిన్నర రూపాయలకు విక్రయించి అందిన కాడికి మోసం చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారి ప్లాట్లను విక్రయించేందుకు వీల్లేకుండా పోయింది. అంతేకాకుండా గతంలో కొనుగోలుదారుల పేర్లపై రియల్ వ్యాపారి చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. దీంతో కొనుగోలుదారులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
మూడు నెలల క్రితం మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ వెంచర్‌లోని రాళ్లను తొలగించారు. అధికారులు తొలగించిన మరునాడే సదరు రియల్ వ్యాపారి మరలా ప్లాట్ల సరిహద్దు తెలుపుతూ రాళ్ళను ఏర్పాటు చేశాడు. అయితే నేటికీ ఆ రాళ్లను తొలగించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రియల్ మోసానికి పాల్పడిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు డిమాండ్ చేస్తున్నారు.