Supreme Court: ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది. ఈ లోపు ఐఏ పై సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. ఇందులో న్యాయవాదులు, న్యాయమూర్తుల పై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. పీసీసి అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించేలా వ్యవహరించారని న్యాయవాదులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం హోం మంత్రి హోదా కూడా సీఎం వద్దనే ఉన్నదని, కేసు ముందుకు తీసుకెళ్ళాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఒకవేళ మరోచోటుకు మార్చితే కూడా అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా అని ప్రశ్నించారు. అప్పుడు జ్యురిస్డిక్షన్ మారుతుందని న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. విచారించే కోర్టు మారినా... పరిధి మారదు, విషయం మారదని న్యాయమూర్తులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కలగజేసుకొని, ఇప్పటికే 25 మంది సాక్షులు నుంచి అన్ని వివరాలు నమోదు అయ్యాయని కోర్టుకు చెప్పారు. అంతేగాక గత శుక్రవారం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. వ్యవస్థ పై తనకు ఎంత గౌరవం ఉందొ కూడా సీఎం ప్రకటన చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో కోర్టులు, న్యాయవ్యవస్థ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని.
ఈ విషయాలతో ఐఏ దాఖలు చేసామని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పీసీసి అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కి పూర్తి బాధ్యత ఉంటుందని, న్యాయవాదుల, న్యాయమూర్తుల ఫోటోలు పెట్టి ఇష్టారీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వివరాలు అన్ని ఐఏ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ల ధర్మాసనం పిటిషనర్ దాఖలు చేసిన ఐఏ పై సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ రెండు వారాలు తర్వాత చేపడుతామని ధర్మాసనం వెల్లడించింది.