BRS లీడర్ల చేతివాటం.. దళిత బంధు పేరిట రూ.9 కోట్లు వసూలు..?

గత బీఆర్ఎస్ హయాంలో దళితబంధు పథకం ఇప్పిస్తామని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గులాబీ లీడర్లు వసూళ్ల పర్వానికి తెరలేపారు.

Update: 2024-01-09 02:07 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గత బీఆర్ఎస్ హయాంలో దళితబంధు పథకం ఇప్పిస్తామని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గులాబీ లీడర్లు వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈ పథకం కోసం ప్రజాప్రతినిధులకే దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ఇదే అదనుగా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, లోకల్ కార్పొరేటర్లు, మరికొంత మంది ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి అడ్వాన్స్ రూపంలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూల్ చేశారు.

ఒక్క అర్బన్ నియోజకవర్గంలోనే రూ.9 కోట్ల మేర డబ్బులు వసూలైనట్లు సమాచారం. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ ఓడిపోవడంతో దళితబంధు పథకం కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని లబ్ధిదారులు నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలరోజుల్లోగా డబ్బులు తిరిగి ఇస్తామని ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ప్రజాదర్బార్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వసూళ్ల పర్వం ఆ పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

నిజామాబాద్ అర్బన్, నియోజకవర్గంలో దళితబంధు పథకం ఇప్పిస్తామని గులాబీ లీడర్లు, ప్రజాప్రతినిధులు వసూల్ చేసిన డబ్బులు వస్తాయో రావోనని దరఖాస్తు చేసిన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లను కేటాయించిన విషయం తెలిసిందే. వాటిని లబ్దిదారులను ఎంపిక చేసి అప్పజెప్పే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే దక్కాయి. మొదటి విడతలో చాలా వరకు బీఆర్ఎస్ లీడర్లు వారి అనుచరులకే దక్కాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో మొదటి విడతలో అవినీతి, అక్రమాలు జరిగాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎంపిక ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతో చేసే విధంగా న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడంతో రెండవ విడత దళితబంధు కోసం దరఖాస్తుల స్వీకరణ జరిగిన విషయం తెలిసిందే. మొదటి విడద దళితబంధుకు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునేలా గులాబీ లీడర్లు ప్రచారం చేశారు.

నిజామాబాద్ అర్బన్‌లో ఇబ్బడిముబ్బడిగా...

నిజామాబాద్ అర్బన్ లో 50 డివిజన్లలో 1100 యూనిట్ల కోసం దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. అయితే ఎస్సీ కార్పొరేషన్ అధికారులు దళితబంధు దరఖాస్తులను స్వీకరించడం లేదని, ప్రజాప్రతినిధుల ద్వారానే అందుకు ఏర్పాట్లను జరుగుతున్నాయని దరఖాస్తులు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అర్బన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధుల భర్తలు మరికొంత మంది వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఒక్కొక్క లబ్ధిదారుడి ఎంపిక కోసం అడ్వాన్స్ రూపంలో రూ.2 లక్షలు మొదలుకుని రూ.3 లక్షల వరకు వసూల్ చేశారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి ప్రజాప్రతినిధి భర్త, ప్రజాప్రతినిధి సోదరుడు, లోకల్ కార్పొరేటర్లు వందల మంది వద్ద నుంచి లక్షల రూపాయల వసూల్ చేశారు.

ఒక్క అర్బన్ నియోజకవర్గంలోనే రూ.9 కోట్ల మేర డబ్బులు వసూలయ్యాయని చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి భర్త 300 యూనిట్లకు సంబంధించిన లబ్దిదారుల నుంచి డబ్బులు వసూల్ చేయగా, ప్రజాప్రతినిధి సోదరుడు 200 యూనిట్ల వరకు, కార్పొరేటర్లు కొందరు 50 నుంచి 100 వరకు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి, ప్రభుత్వం మారడంతో దళితబంధు వస్తుందా, రాదా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దళితబంధు కోసం గులాబీ లీడర్లకు, ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చిన వారు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని స్థానికంగా లీడర్లపై నెలరోజుల క్రితం ఒత్తిడి తెచ్చారు.

నెల రోజుల్లో తిరిగి ఇస్తామని ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ నాయకులు సమీక్షా సమావేశంలో హామీ ఇచ్చారు. తీరా నెల రోజులు గడిచినా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు రేపుమాపు అంటూ దాట వేయడంతో ఈ విషయంపై ప్రజాదర్భార్ లో ప్రభుత్వానికే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తుదారులు సిద్దమౌతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అంతా సిద్దమౌతున్న వేళ నిజామాబాద్ అర్బన్‌లో జరిగిన వసూళ్ల పర్వం ఆ పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ లీడర్లుగా డబ్బులు వసూల్ చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించేందుకు కసరత్తు జరుగుతున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు.

దళితబంధు ఇప్పిస్తామని డబ్బులు వసూల్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది. త్వరలోనే పార్లమెంట్, బల్ధియా ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పేరిట ఒక్క అర్బన్‌లోనే రూ.9 కోట్లకు పైగా డబ్బులు వసూలయ్యాయని తెలిసి అందరూ నోరెళ్లాబెడుతున్నారు. ప్రభుత్వం దళిత, సామాజిక వర్గానికి అండదండలు ఇచ్చేందుకు ఉద్దేశించినే దళితబంధు పథకం గులాబీ లీడర్లకు బంగారు గుడ్లు పెట్టే బాతులా మారడంపై తలోదిక్కుగా చర్చించుకుంటున్నారు. మళ్లీ గెలుస్తామో లేదో ప్రజల నుంచి ఓట్లు అడుగుతామో లేదోనన్న సోయి లేకుండా కోట్ల రూపాయలు వసూల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Similar News