చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లుంది ప్రభుత్వం తీరు.. కేటీఆర్ సంచలన ట్వీట్
చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీరు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. ఇసుక మాఫియా (Sand Mafia)పై వస్తున్న వార్తల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు చేస్తున్నారని, నీళ్లన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల (Telemetries) గురించి మాట్లాడుతున్నది అని ఎద్దేవా చేశారు. అలాగే కృష్ణా (Krishna River), గోదావరి నదుల (Godavari River) నుండి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన (Congress Governance) పాపం ఫలితమే తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాల్లో నీటి వాటా తేలకపోవడానికి కారణమని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కాళేశ్వరం (Kaleshwaram), పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను (Palamuru Rangareddy Lift Irrigation Scheme) వడివడిగా పూర్తి చేసి వందల టీఎంసీలు ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు. కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపి మరమ్మతులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారు అని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్దంగా ఉన్నా, నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా టెండర్లు రద్దు చేసి, 15 నెలలుగా పనులను పడావుపెట్టారని తెలిపారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తున్నది అని, అన్నం పెట్టే అన్నదాతకు సున్నంపెట్టి.. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.