రాష్ట్రమంతా 8 రోజుల హడావుడి.. ప్రజాప్రతినిధులు, అధికారుల సందడి!
పాలనా యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పాలనా యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ‘ప్రజా పాలన’ పేరుతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డును కవర్ చేసేలా ఎనిమిది రోజుల షెడ్యూల్‌ను రూపొందించింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. రోజుకు కనీసంగా రెండు గ్రామ సభల చొప్పున నిర్వహించేలా అధికారులకు సీఎం స్పష్టం చేయనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కాన్ఫెరెన్సులో ప్రభుత్వ ప్రయారిటీలపై దిశానిర్దేశం చేయనున్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు..
గత ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను అరికట్టడంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల టైమ్‌లో ప్రకటించిన, హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయడంపై కలెక్టర్లకు స్పష్టత ఇవ్వనున్నారు. మొత్తం పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేలా ‘ప్రజా పాలన’ అనే పేరుతో క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లుగానే అన్ని జిల్లా, డివిజన్, మండల కేంద్రాలతో పాటు గ్రామ స్థాయిలోనూ పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సీఎం ప్రకటించనున్నారు. ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు
అన్ని గ్రామాల్లో ఈ నెల 28న మొదలయ్యే ప్రజా పాలన జనవరి 6వ తేదీ వరకు కొనసాగేలా క్యాలెండర్‌ను రూపొందించింది. దీని నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రయారిటీ, ఆవశ్యకత తదితరాలపై కాన్ఫరెన్సుకు హాజరయ్యే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం వివరించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు రోజూ రెండు గ్రామాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించనున్నారు.
ప్రతీ గ్రీవెన్స్ కంప్యూటర్‌లో రికార్డు
వివిధ స్థాయిల్లో జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్‌లను అధికారులు ఆహ్వానిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చే ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేకమైన నెంబర్‌ను కేటాయిస్తారు. వీటన్నింటినీ కంప్యూటర్‌లో డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. ఫిర్యాదుదారులు ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను తెలుసుకునేలా వెబ్‌సైట్ రూపొందింది.
ప్రజల దగ్గరకు పాలన
రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్ హరిచందనను ప్రభుత్వం నియమించింది. సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత సెల్ నంబర్లకు మెసేజ్ వెళ్తుంది. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందో స్పష్టం చేస్తారు. ప్రజాస్వామిక పరిపాలన ఏడో గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో ప్రజల దగ్గరకు పరిపాలనను తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రజావాణి, ప్రజాపాలన లాంటి ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టారు.