విచ్చలవిడిగా బీఆర్ఎస్ లీడర్లకు కాంట్రాక్టులు.. సంచలన నిర్ణయం దిశగా కాంగ్రెస్ సర్కార్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. అందుకు సుమారు రూ.4 వేల కోట్ల ‘స్పెషల్ ఫండ్స్’ను కేటాయిస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నిధులు విడుదలై పనులు ప్రారంభమైనచోట వర్క్స్ కంప్లీట్ అయ్యేలా వెసులుబాటు కల్పిస్తూనే.. ఇప్పటికీ గ్రౌండింగ్ కాని పనుల విషయంలో మాత్రం ఉత్తర్వులను, శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయమై సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. త్వరలో ఆయా శాఖల ద్వారా రాతపూర్వకంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
బీఆర్ఎస్ లీడర్లకే కాంట్రాక్టు?
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతేడాది మార్చి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించారు. అందులోంచే నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల కోసమే ఇష్టానుసారంగా రూ.కోట్లతో డెవలప్‌మెంట్ పనులు మొదలు పెడుతున్నారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద నిధులు రిలీజ్ అయిన తర్వాత అభివృద్ధి పనులకు టెండర్లను పిలవకుండా నామినేషన్ పద్ధతిలోనే చేపట్టేలా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. పనుల కాంట్రాక్టులను బీఆర్ఎస్ లీడర్లకు కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే నిధులను రిలీజ్ చేస్తే కోడ్ ఇబ్బందులు ఉండవని కేసీఆర్ భావించారు. ఆ ప్రకారం సెప్టెంబరు చివరినాటికే సుమారు రూ.4 వేల కోట్ల మేర పనులను నాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే పనులు మొదలయ్యాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో మాత్రం వర్క్స్ స్టార్ట్ కాలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఆయా శాఖల సమీక్షల సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. గ్రౌండింగ్ కాని పనులన్నింటికీ సంబంధించిన శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని సర్కారు ఆదేశాలిచ్చినట్టు టాక్. దీంతో సచివాలయ అధికారులు సైతం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
విచ్చలవిడిగా హామీలు..
గతేడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత పలు జిల్లాల, నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకమైన హామీలు ఇచ్చారు. నియోజకవర్గం, గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ప్రభావితం అవుతారని భావించింది. సీఎం తల్చుకుంటే కొదువా.. అనే తీరులో అనేక చోట్ల పదుల కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్టు ప్రకటనలు చేశారు. కొన్ని పనులకు ఆర్థిక శాఖ నిధులను సైతం రిలీజ్ చేసింది. బాన్సువాడకు రూ.50 కోట్లను ఇవ్వనున్నట్టు గతేడాది మార్చి 3న కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గానికి దీటుగా అక్కడ అభివృద్ధి జరిగిందని ఎన్నికల ప్రచారం సీఎం చెప్పుకొచ్చారు.
పనుల పరిశీలన తర్వాతే బిల్లులు చెల్లింపు
ఎస్డీఎఫ్ కోటాలో శాంక్షన్ చేసిన రూ.4 వేల కోట్ల పనుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన పనులు ప్రారంభమైనట్టు అధికారుల అంచనా. నియోజకవర్గాలవారీగా ఆయా శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఎలాగూ పనులు ప్రారంభమైనందున వాటిని కంప్లీట్ చేయాలని, పెండింగ్ నిధులను రిలీజ్ చేయాలని సీఎం కార్యాలయం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. వాటికి మాత్రమే నిధులు విడుదల చేసేలా ఆఫీసర్లు చొరవ తీసుకుంటున్నారు. ఈ పనులపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం.
ఎన్నికల టైంలో సీఎం హామీల్లో కొన్ని..
- స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.50 కోట్లను బాన్సువాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నాను
(నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా..)
- మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తున్నా.
(మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బహిరంగసభలో..)
- గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు చెరి రూ.40 కోట్ల చొప్పున కేటాయిస్తున్నా. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు తలా రూ.20 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా.
(కొత్తగూడెం టౌన్‌లో పబ్లిక్ మీటింగ్‌లో...)