Harish Rao : కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : హరీశ్ రావు
కాంగ్రెస్(Congress)అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి టీ.హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress)అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి టీ.హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నాయకులు హరీష్ రావు వెంట ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటైన ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పంట కూడా కొనలేని దుస్థితి నెలకొందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందని, కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా దక్కని పరిస్థితి ఉందని విమర్శి్ంచారు. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారని, రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందని ప్రశ్నించారు.
రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదని, పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శంకర్ రమాదేవి అనే రైతులు 8 ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం 5 క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగిందని,
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లేనని విమర్శించారు.
రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని, కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారని ఆరోపించారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని, గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదన్నారు. రుణమాఫీ చేయకుండా రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని, రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేశారని, రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని మోసం చేశారని, రూ.12,000 రైతు కూలీలకు ఇస్తామని మోసం చేశారని, రూ.500 బోనస్ ఇస్తామని కూడా మోసం చేశారని ఆరోపించారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాడడమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదని దుయ్యబట్టారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని, ఒక రైతుకైనా సన్నరకం వడ్లకు బోనస్ వచ్చిందా అని ప్రశ్నించారు. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైందన్నారు. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడడం లేదని ఆరోపించారు. పత్తి సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే, మార్కెట్లో 15,000 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు జరిగిందని, ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, కానీ పత్తి వరి కొనుగోళ్లపై సమీక్ష చేయడం లేదన్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికి మెమోలు జారీ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమోనన్నారు. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.